కాళేశ్వరం: రాష్ట్రంలో మహాప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన కాళేశ్వర ముక్తీశ్వర పుణ్యక్షేత్రం సరస్వతీ పుష్కరాలకు (Saraswati Pushkaralu) సిద్ధమవుతున్నది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో ఈ నెల 15 నుంచి 26 వరకు సరస్వతీ నది పుష్కరాలు వైభవంగా జరుగనున్నాయి. ఈ వేడుకలకు తెలంగాణతోపాటు ఏపీ, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, కర్ణాటక నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరుకానున్నారు. ప్రతిరోజూ దాదాపు లక్ష మంది భక్తులు వస్తారని అధికారులు భావిస్తున్నారు. దీనికి తగినట్లుగా ఏర్పాట్లు చేస్తున్నారు. దక్షిణ భారతదేశంలో ఒక్క కాళేశ్వరంలోనే సరస్వతి పుష్కరాలు జరుగుతుండటం విశేషం.
సరస్వతి పుష్కరం అనేది సరస్వతి నదికి జరిగే పండుగ. ఇది సాధారణంగా ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. సరస్వతి నదిని త్రివేణి సంగమం వద్ద ప్రవహించే అంతర్వాహిని (అదృశ్య నది)గా పరిగణిస్తారు. ఈ పుష్కరాన్ని బృహస్పతి మిథున రాశిలోకి ప్రవేశించినప్పటి నుంచి 12 రోజుల పాటు ఆచరిస్తారు. మే 14న రాత్రి 10.35 గంటలకు బృహస్పతి మిథున రాశిలోకి ప్రవేశించే సమయంలో పుష్కరకాలం ప్రారంభం కానుంది. మరుసటి రోజు సూర్యోదయం నుంచి పుష్కర పుణ్యస్నానాలు ఆచరించాల్సి ఉంటుందని కాళేశ్వరం పుణ్యక్షేత్ర ఆలయ అర్చకులు తెలిపారు.
నది ఒడ్డున ఉన్న 10 అడుగుల సరస్వతి విగ్రహం, అరచేతుల్లో తాళపత్ర గ్రంథాల నిర్మాణం ఈ పుష్కరాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలువనుంది. దేశంలో ఎక్కడాలేని విధంగా ఒకే పానవట్టంపై రెండు శివలింగాలు (కాళేశ్వర, ముక్తీశ్వర స్వామి) ఉన్న పుణ్యక్షేత్రం కాళేశ్వరం ఒక్కడే కావడం గమనార్హం. ఈ రెండు లింగాలకు నిత్యం అభిషేకించిన నీరు గోదావరి, ప్రాణహిత నదుల సంగమ స్థానంలో కలుస్తుండటంతో ఇక్కడి సరస్వతి నదిని అంతర్వాహినిగా పిలుస్తారు. గతంలో 2013లో సరస్వతి పుష్కరాలు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరుగుతున్న తొలి పుష్కరాలు ఇవే కావడం గమనార్హం.