హైదరాబాద్, అక్టోబరు 5 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ నగరం నెక్లెస్‌రోడ్‌లోని హెచ్ఎండీఏ మైదానంలో 11 రోజుల పాటు ‘సరస్ మేళా’ను నిర్వహిస్తున్నట్టు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) సీఈవో గౌతమ్ పొట్రు తెలిపారు. ఇందులో 19 రాష్ర్టాలకు చెందిన కళాఖండాలు ప్రదర్శించనుండగా, మొత్తం 300 స్టాళ్లను ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు. దీనిని శుక్రవారం మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రారంభించనున్నట్టు తెలిపారు.
స్వయం సహాయక సంఘాల మహిళలు తయారు చేసిన ఉత్పత్తులను ఇందులో ప్రదర్శిస్తారని చెప్పారు. చేనేత, హస్తకళలు, వివిధ రకాల పిండి వంటల ప్రదర్శన, అమ్మకాలు ఉంటాయని వివరించారు. ఈ ఎగ్జిబిషన్లో ప్రవేశం ఉచితం అని, రోజూ సాయంత్రం వేళ తెలంగాణ సాంసృతిక శాఖ ఆధ్వర్యంలో సాంసృతిక కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు.