హైదరాబాద్, జనవరి 11 (నమస్తే తెలంగాణ): సంక్రాంతి పండుగ నేపథ్యం లో హైదరాబాద్లో ఉంటున్న కుటుంబాలు సొంతూళ్లకు బయల్దేరాయి. ప్రధానం గా ఏపీకి వెళ్లే ప్రయాణికులతో రైల్వేస్టేషన్లు కిక్కిరిసిపోతున్నాయి. మరోవైపు దూరప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులను దక్షిణ మధ్య రైల్వే జోన్ అధికారులు అంచనా వేయలేకపోయారు. రిజర్వేషన్ బోగీల ఏర్పాటుకు ప్రాధాన్యతనిచ్చిన అధికారులు, జనరల్ బోగీలు మాత్రం అరకొరగా ఏర్పాటు చేయడంతో రద్దీ పెరిగింది. ఈ క్రమంలో చిన్నారులు, వయోవృద్ధులు, మహిళలు, గర్భిణులు రైలు ఎక్కడం, దిగటంతోపాటు జనరల్ బోగీల్లో కాలు పెట్టేందుకు కూడా స్థలం లేకుండా పోయిందని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పండుగ నేపథ్యంలో సౌకర్యాలు మెరుగుపర్చాల్సిన రైల్వే అధికారులు ఏమీ పట్టించుకోవటం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రైళ్లతోపాటు సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి, చర్లపల్లి రైల్వేస్టేషన్లలో సౌకర్యాలపైనా ప్రయాణికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రెగ్యులర్ రైళ్లను పెంచకుండా ప్రత్యేక రైళ్ల పేరిట సాధారణ టిక్కెట్ చార్జీలపై 30శాతానికి పైగా అదనపు చార్జీలు వసూలు చేయటంపై పలువురు విమర్శిస్తున్నారు. కాగా, పండుగ నేపథ్యంలో దాదాపు 300లకు పైగా ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసినట్టు రైల్వే అధికారులు తెలిపారు.