ఓవైపు కాల్వల్లో నీళ్లు రాక పంటలు ఎండి పోయి రైతులంతా కన్నీళ్లు పెడుతున్నరు. ప్రాజెక్టుల నుంచి నీటిని ఎత్తిపోయకుంటే సాగునీరివ్వలేమని అధికారులు తేల్చిచెప్పినా కాంగ్రెస్ సర్కారు కనికరించలేదు. రాష్ట్రమంతటా కృత్రిమ కరువు పరిస్థితులు నెలకొని అన్నదాతలు అల్లాడుతున్నా ప్రభుత్వం ముఖం చాటేయడం వెనుక ‘అసలు కథ’ వేరే ఉన్నది. మేడిగడ్డ సహా బరాజ్‌లను ఎండబెట్టి ఇసుక నిల్వలను కొల్లగొట్టే పనిలో సర్కారు నిమగ్నమైంది.
Kaleshwaram | హైదరాబాద్, మార్చి 23 (నమస్తే తెలంగాణ) : ‘ప్రాజెక్టుల్లో నీళ్లుంటే ఏమొస్తది? అదే ఎండబెడితే ఇసుక తోడచ్చు.. కోట్లాది రూపాయలు దండుకోవచ్చు’ అన్నదే నేటి కాంగ్రెస్ సర్కారు విధానమని స్పష్టమవుతున్నది. ‘ఎస్ఎల్బీసీ టన్నెల్‌ను ఎంత ఖర్చయినా పునరుద్ధరిస్తాం. పనులు పూర్తి చేస్తాం’ అంటూ ప్రగల్భాలు పలుకుతున్న పాలక పెద్దలు, అదే మేడిగడ్డ సహా బరాజ్‌ల మరమ్మతుల ఊసెత్తకపోవడం వెనుక ‘ఇసుక’ మతలబు ఉన్నదని తేటతెల్లమవుతున్నది. నీటిని ఎత్తిపోయకుంటే సాగునీరివ్వలేమని అధికారులు చెప్పినా సర్కారు వినిపించుకోవడం లేదు. సాగునీరందక పంటలు ఎండుతున్నా పట్టింపు లేదు. దీని వెనుక ‘అది కేసీఆర్ కట్టిన ప్రాజెక్టు కాబట్టి’ అనేది ఒకెత్తయితే.. మరోకారణం వేల కోట్ల విలువైన ఇసుక నిల్వలను కొల్లకొట్టే కుతంత్రమేనని తెలుస్తున్నది.
ఒక్క మేడిగడ్డ వద్దనే దాదాపు 1000 కోట్ల విలువైన ఇసుక నిల్వలు ఉన్నాయంటే.. అన్నారం, సుందిళ్ల బరాజ్‌లతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అనేక చెక్‌డ్యామ్‌ల వద్ద ఏమేరకు నిల్వలు ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే గోదావరితోపాటు, వాగుల నుంచి ఇష్టారాజ్యంగా ఇసుక తరలిస్తున్నారు. అందుకోసమే ఎన్డీఎస్ఏ నివేదికను సాకుగా చూపి బరాజ్‌లను ప్రభుత్వం ముట్టుకోవడం లేదని అర్థమవుతున్నది. ప్రాజెక్టుల నుంచి నీళ్లను వదిలి చెక్‌డ్యామ్‌లను కూడా నింపనిదీ ఇసుక కోసమేనని క్షేత్రస్థాయి పరిసితిని గమనిస్తే తెలుస్తున్నది.
కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల వద్ద భారీగా ఇసుక మేటలు ఉన్నాయి. ప్రాజెక్టు అందుబాటులోకి వచ్చిన నాటి నుంచి మేడిగడ్డ మొదలు సుందిళ్ల వరకు, ఎగువ ఎల్లంపల్లి సైతం ఎప్పుడూ నిండుగా కళకళలాడాయి. ఈ నేపథ్యంలో ఇసుక తోడివేత దాదాపు ఐదేళ్ల పాటు అంతంతమాత్రమే కొనసాగింది. దీంతో ఎల్లంపల్లి ఎగువన, దిగువన మేడిగడ్డ వరకు భారీగా ఇసుక నిల్వలు పేరుకుపోయాయి. ఒక్క మేడిగడ్డ వద్నే దాదాపు 1.92 కోట్ల మెట్రిక్ టన్నుల ఇసుక నిల్వలు ఉన్నట్టు గతంలో టీజీఎండీసీ తేల్చింది. ఆ ఇసుక నిల్వల విలువ 1000 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేసింది.
ఇసుక నిల్వలను తోడివేతకు దాదాపు రెండేళ్ల సమయం పడుతుందని తేల్చింది. ఇప్పటికే మహదేవపూర్ పరిధిలో ఇసుక బ్లాక్‌లను వేలం వేసి మేటలను తొలగిస్తున్నారు. అన్నారం, సుందిళ్ల రెండు బరాజ్‌లలోనూ దాదాపు మేడిగడ్డ వద్ద ఉన్న స్థాయిలోనే ఇసుక నిల్వలు ఉన్నట్టు టీజీఎండీసీ అంచనా వేసింది. దాదాపు కాళేశ్వరంలోని 3 బరాజ్‌ల ద్వారానే ప్రభుత్వానికి దాదాపు రూ.2000 వేల కోట్లకు పైగా ఆదాయం వస్తుందని అంచనా! ఆ మేరకు సొమ్ము చేసుకునేందుకు కాంగ్రెస్ పెద్దలు సిద్ధమైనట్టు తెలుస్తున్నది.
మేడిగడ్డ బరాజ్ అన్నివిధాలుగా సురక్షితంగానే ఉన్నదని అధికారవర్గాలు వెల్లడించాయి. 7వ బ్లాక్‌లో కుంగుబాటుకు గురైన 20వ పిల్లర్ మినహా ఇతర డ్యామేజీ జరగలేదని వివరిస్తున్నాయి. ఈ ఏడాది జూలైలో లక్ష్మీబరాజ్ (మేడిగడ్డ) వద్ద 10 లక్షల క్యూసెక్కుల ప్రవాహం కొనసాగిందని, 103.55 మీటర్ల మేర ప్రవాహం నమోదైందని, ఆ తర్వాత దాదాపు నెలరోజులు సగటున రోజుకు 5 లక్షల క్యూసెక్కులు తగ్గకుండా వరద కొనసాగిందని, అయినా బరాజ్ చెక్కు చెదరలేదని వివరిస్తున్నారు. 7వ బ్లాక్‌ను పునరుద్ధరిస్తే యథావిధిగా ప్రాజెక్టులను వినియోగంలోకి తేవచ్చని ఇంజినీర్లు, నిపుణులు ఘంటాపథంగా చెప్తున్నారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం మేడిగడ్డనే కాదు, అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల పునరుద్ధరణ అంశంపైనే దృష్టి సారించడం లేదు. మేడిగడ్డ ఘటన జరిగిన తర్వాత రాష్ర్టానికి వచ్చిన ఎన్డీఎస్ఏ బృందం తాత్కాలిక రక్షణ చర్యలను సిఫారసు చేసింది.
తదుపరి పూర్తిస్థాయి నివేదికను డిసెంబర్ నెలాఖరులోగా అందిస్తామని గతంలో స్పష్టం చేసింది. కానీ ఇప్పటికీ నివేదికను విడుదల చేయలేదు. ఇదిలా ఉంటే ఎన్డీఎస్ఏ సిఫారసులు చేస్తేనే బరాజ్‌ల పునరుద్ధరణకు పూనుకుంటామంటూ కాంగ్రెస్ చేతులు దులుపుకొన్నది. అంతేతప్ప నివేదికను తెప్పించుకునేందుకు ఎలాంటి ప్రయత్నం చేయడం లేదు. అదీగాక ఎన్డీఎస్ఏ కోరిన సమాచారాన్ని కూడా ఇప్పటికీ పూర్తిస్థాయిలో ఇవ్వకుండా కాలయాపన చేసింది. సర్కారు వ్యవహారంతో తమకు అందిన సమాచారం మేరకే నివేదిక ఇస్తామని ఎన్డీఎస్ఏ ఇటీవల వెల్లడించింది. దీని వెనుక ప్రభుత్వ పెద్దల ఉద్దేశం వేరే ఉన్నదని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. కేవలం బరాజ్‌ల వద్ద గోదావరిలో పేరుకుపోయిన వేల కోట్ల ఇసుక నిల్వలను సొమ్ము చేసుకునేందుకే రిపేర్ల ఊసెత్తడం లేదని స్పష్టం చేస్తున్నారు. ఎన్డీఎస్ఏ నివేదికను సాకుగా చూపి ఇసుకను కొల్లగొట్టే ప్రయత్నాలు చేస్తున్నట్టు చెప్తున్నారు.
కేసీఆర్ ప్రభుత్వం వాగుల పునరుజ్జీవం పథకాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. రాష్ట్రంలోని అనేక వాగులపై వందల సంఖ్యలో చెక్‌డ్యామ్‌లు నిర్మించి జలాలను ఒడిసిపట్టింది. మానేరు, మున్నేరు, ఆకేరు, పాలేరు, స్వర్ణ, పెద్దవాగు, కూడవెల్లి, చలివాగు, నారింజవాగు, బొగ్గులవాగు తదితర వాగులపై చెక్‌డ్యామ్‌లు నిర్మించింది. వాటిలో పదుల సంఖ్యలో చెక్‌డ్యామ్‌లను మేజర్, మీడియం, మైనర్ ప్రాజెక్టులతో అనుసంధానించింది. క్రమం తప్పకుండా నీటిని వదులుతూ వాటిని ఎప్పుడూ నిండుగా ఉండేలా చూసింది.
ప్రస్తుతం ఆయా చెక్‌డ్యామ్‌ల వద్ద కూడా భారీగా ఇసుక మేటలు ఏర్పడ్డాయి. వేల కోట్ల ఆదాయం సమకూరే అవకాశమున్నది. ప్రభుత్వ పెద్దలు వాటిపైనా కన్నేశారు. ఈ నేపథ్యంలోనే ఈ ఏడాది ఆయా ప్రాజెక్టుల ద్వారా, కాల్వల ద్వారా ఆయా చెక్‌డ్యామ్‌లను నింపకుండా వదిలేశారని తెలుస్తున్నది. ఫలితంగా ప్రస్తుతం మొన్నటివరకు నిండుగా కళాకళలాడిన చెక్‌డ్యామ్‌లు ప్రస్తుతం వెలవెలబోతున్నాయి. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ఆయా వాగుల నుంచి ఇసుక తొడివేత ఇష్టారాజ్యంగా కొనసాగుతున్నది. ఇసుక నిల్వలను ఖతం పట్టించేందుకే చెక్‌డ్యామ్‌ల్లో నీళ్లు నింపకుండా వదిలేశారని స్పష్టంగా తెలిసిపోతున్నది.
అన్నారం బరాజ్ నుంచి దాని ఎగువన సుందిళ్ల బరాజ్ వరకు 35 కిమీ దూరంలో భారీగా ఇసుకనిల్వలు ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. అదీగాక అన్నారం బరాజ్ ఎగువనే మానేరు నది కూడా గోదావరిలో కలుస్తుంది. కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకమైన మేడిగడ్డ బరాజ్ వినియోగంలో ఉన్నంతవరకూ అన్నారం, సుందిళ్లతోపాటు ఇటు మానేరులోనూ ఎగువకు భారీగా బ్యాక్‌వాటర్ విస్తరించి ఉండేది. ఇసుక మేటలు భారీగా వేశాయి. ప్రస్తుతం బరాజ్‌లు ఖాళీ అవడంతో ఈ ఇసుకపై కాంగ్రెస్ పెద్దలు కన్నేశారు.
ఈ క్రమంలోనే తాజాగా అన్నారం నుంచి సుందిళ్ల బరాజ్ వరకు, అదేవిధంగా గోదావరిలో కలిసే ప్రాంతం నుంచి ఎగువకు దాదాపు 20కిమీ వరకు మానేరులో విస్తరించిన ఇసుక నిల్వలను అంచనా వేయాలని ప్రభుత్వం ఇటీవలే ఆదేశించింది. అందులో భాగంగా సైతం అన్నారం నుంచి సుందిళ్ల వరకు లైడార్ సర్వే నిర్వహించారు. దాదాపు 35కిమీ పొడవునా 2.52 కోట్ల క్యూబిక్ మీటర్ల ఇసుక నిల్వలు ఉన్నట్లు గుర్తించారు. దీని ద్వారా ప్రభుత్వానికి దాదాపు రూ.1000-1200కోట్ల ఆదాయం సమకూరే అవకాశముందని అంచనా. ఇంకా మానేరులో ఇసుక నిల్వలపై సర్వే నిర్వహించాల్సి ఉండగా, అక్కడా భారీ నిల్వలు ఉన్నట్లు తెలుస్తున్నది.