హైదరాబాద్, మే 15 (నమస్తే తెలంగాణ): పెండింగ్‌లో ఉన్న డీఏలను మంజూరుచేయడంతో పాటు ఎన్నికల రెమ్యూనరేషన్లోని వ్యత్యాసాలను సవరించాలని తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం(టీజీవో) ప్రభుత్వాన్ని కోరింది. టీజీవో రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఏలూరి శ్రీనివాస్‌రావు, ఎనుగుల సత్యనారాయణ నేతృత్వంలోని ప్రతినిధి బృంధం బుధవారం సీఎస్ శాంతికుమారిని కలిసి వినతిపత్రాన్ని అందజేసింది. ఐఆర్‌ను 20శాతానికి పెంచాలని కోరింది. హెల్త్‌కార్డులను జారీచేయాలని, సీపీఎస్‌ను రద్దు చేయాలని వినతిపత్రాన్ని సమర్పించారు. 30శాతం ఫిట్‌మెంట్‌ను ఇవ్వాలని బహుజన క్లాస్ టీచర్స్ అసొసియేషన్ (బీసీటీఏ) కోరింది. రాష్ట్ర అధ్యక్షుడు కే కృష్ణుడు నేతృత్వంలోని ప్రతినిధి బృందం బుధవారం బీఆర్కేభవన్లో పీఆర్సీ కమిటీతో భేటీ అయ్యింది. నాన్ స్పౌజ్టీచర్స్ అసొసియేషన్ ప్రతినిధులు వెంకట్‌రెడ్డి, సక్కుబాయి, దేవరుషి, కృష్ణకుమారి, రూపరాణి తదితరులు సైతం పలు ప్రతిపాదనలను పీఆర్సీ కమిటీకి అందజేశారు.