రాజన్న సిరిసిల్ల, అక్టోబర్ 20 (నమస్తే తెలంగాణ): రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన నేత కార్మికుడు ఆడెపు సంపత్ (60) ఆదివారం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సిరిసిల్ల పట్టణంలోని బీవైనగర్కు చెందిన సంపత్ మరమగ్గాల పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ప్రస్తుత ప్రభుత్వం బతుకమ్మ చీరల ఆర్డర్లు ఇవ్వకపోవడంతో పరిశ్రమలోని సాంచాలు మూతపడ్డాయి. పని కోల్పోయిన సంపత్ అడ్డమీద కూలి పనికివెళ్తున్నాడు. భవననిర్మాణ రంగంలో బరువైన పనులు చేయలేక మానేశాడు. పెద్ద కుమారుడు నాగరాజు ఆటో డ్రైవర్గా పనిచేస్తున్నాడు. చిన్నకొడుకు రాజు ఓ హోటల్లో పనికి పోతున్నాడు. భార్య భాగ్య బీడీలు చుడుతున్నది. ఈ క్రమంలో శనివారం రాత్రి అందరూ పడుకున్న తర్వాత దూలానికి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. వస్త్ర పరిశ్రమకు ప్రభుత్వం చేయూతనివ్వక పోవడంతో నేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని తెలంగాణ పవర్లూం వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు మూషం రమేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. నేత కార్మికుల ఆత్మహత్యలకు సర్కారే కారణమని ఆరోపించారు. నేత కార్మికులకు ఉపాధి కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని డిమాండ్ చేశారు.