హైదరాబాద్, ఆగస్టు 1 (నమస్తే తెలంగాణ): ఇంజినీరింగ్‌తో పాటు ఇతర వృత్తి విద్యా కోర్సుల ఫీజులను ఈ ఏడాది పెంచరాదని, పాత ఫీజులనే కొనసాగించాలని తెలంగాణ అడ్మిషన్స్ అండ్ ఫీజు రెగ్యులేటరీ అథారిటీ (టీఏఎఫ్ఆర్సీ) నిర్ణయించింది. టీఏఎఫ్ఆర్సీ చైర్మన్ జస్టిస్ స్వరూప్‌రెడ్డి అధ్యక్షతన సోమవారం నిర్వహించిన సమావేశంలో విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి, జేఎన్టీయూహెచ్ వీసీ ప్రొఫెసర్ కట్టా నర్సింహారెడ్డి, ఉస్మానియా యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ డీ రవీందర్ తదితరులు పాల్గొని ఫీజుల సవరణ ప్రతిపాదనలపై సుదీర్ఘంగా చర్చించారు. కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఫీజుల పెంపు సరికాదన్న అభిప్రాయాన్ని సభ్యులు వ్యక్తంచేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో తల్లిదండ్రులపై భారం మోపవద్దని భావించి ఈ విద్యా సంవత్సరం పాత ఫీజులనే కొనసాగించాలని నిర్ణయించారు. ఫీజులపై టీఏఎఫ్ఆర్సీ నిర్ణయమే ఫైనల్ కావడంతో విద్యార్థులకు భారీ ఉపశమనం కలగనున్నది. గత సంవత్సరం మెడికల్ ఫీజులను సైతం సవరించాల్సి ఉండగా, కరోనా కారణంగా ఏడాది పాటు మినహాయించారు. ఇదే పద్ధతిలో వృత్తివిద్యాకోర్సుల ఫీజుల పెంపును వాయిదావేశారు. దీనితో సుమారు 3 లక్షల మంది గ్రామీణ, నిరుపేద విద్యార్థులకు ఊరట లభించనున్నది. ఇందుకు సంబంధించి ఒకట్రెండు రోజుల్లో జీవో జారీ చేయనున్నారు. దీంతో పాత ఫీజుల ప్రకారం కౌన్సెలింగ్ నిర్వహించి, సీట్లను భర్తీచేస్తారు.
మూడేండ్లకు ఒకసారి ఫీజుల సవరణ
ఇంజినీరింగ్ సహా వృత్తి విద్యా కాలేజీల ఫీజులను మూడేండ్లకొకసారి సవరిస్తారు. మొదటిసారిగా 2016లో ఫీజులను పెంచగా, 2019లో మరోసారి ప్రైవేట్ కాలేజీల్లోని ట్యూషన్ ఫీజులను పెంచారు. 2019లో పెంచిన ఫీజుల గడువు 2021-22 సంవత్సరంతో ముగిసింది. తాజాగా 2022-23, 2023-24, 2024-25 మూడేండ్ల బ్లాక్ పీరియడ్‌కు సంబంధించిన ఫీజుల సవరణకు టీఏఎఫ్ఆర్సీ నోటిఫికేషన్ జారీచేయగా, 1,248 వృత్తివిద్యా కాలేజీలు తమ ప్రతిపాదనలు అందజేశాయి. అయితే, కరోనా పరిస్థితుల కారణంగా ఈ విద్యా సంవత్సరంలో ఫీజులు పెంచరాదని నిర్ణయించారు. 2019-20 విద్యా సంవత్సరంలో 21 కాలేజీల్లో ఫీజులు రూ.లక్షకు పైగా ఉండగా, మరో 25 కాలేజీల్లో ఫీజులు రూ.75 వేల నుంచి లక్ష వరకు ఉన్నాయి. కనిష్ఠంగా ఇంజినీరింగ్ ఫీజు రూ.35 వేలు ఉన్నది. తాజాగా నిర్ణయంతో ఇవే ఫీజులు అమలవుతాయి.
మిగతా కోర్సులకు అంతే..
ఇంజినీరింగ్ పాటు అన్ని రకాల వృత్తి విద్యాకోర్సుల్లో పాతఫీజులే కొనసాగుతాయి. ఎంఈ, ఎంటెక్, బీ ఫార్మసీ, ఎం ఫార్మసీ, ఫార్మా-డీ, ఫార్మా-డీ (పీబీ), ఎంబీఏ, ఎంసీఏ, ఎల్ఎల్బీ/ బీఎల్, ఎల్ఎల్ఎం/ ఎంఎల్, బీఈడీ, ఎంఈడీ, డీపీఈడీ, యూజీడీపీఈడీ తదితర కోర్సులకూ ఇదే విధానం వర్తిస్తుంది. ఫీజుల సవరణ నుంచి ఈ విద్యా సంవత్సరానికి మినహాయింపు ఇవ్వగా, వచ్చే ఏడాది 2023-24 విద్యా సంవత్సరం నుంచి కొత్త బ్లాక్ పీరియడ్ ప్రారంభంకానున్నది. కొత్తగా ఫీజులను ఖరారుచేస్తే, ఈ బ్లాక్ పీరియడ్ 2025-26 వరకు కొనసాగుతుంది. ఈ ఏడాది ఫీజుల సవరణ కోసం కాలేజీలు కట్టిన ఫీజులను, వచ్చే ఏడాదికి బదాయిస్తామని అధికారులంటున్నారు. కాలేజీలు కొత్తగా ప్రతిపాదనలు సమర్పిస్తే సరిపోతుందని, వాటి ఆధారంగా మళ్లీ విచారణ జరిపి కొత్తవాటిని ఖరారుచేస్తామని చెప్తున్నారు.