Tirumala | హైదరాబాద్, సెప్టెంబర్ 25 (నమస్తే తెలంగాణ): తిరుమలలో సాలకట్ల బ్రహ్మోత్సవాలు మంగళవారంతో ముగియనున్నాయి. ఎనిమిదో రోజైన సోమవారం ఉభయ దేవేరుల సమేత శ్రీమలయప్పస్వామివారి రథోత్సవం వైభవంగా జరిగింది. నాలుగు గంటలపాటు సాగిన రథోత్సవంలో భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొని స్వామివారి రథాన్ని లాగారు. మొత్తం 66,598 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. 25,103 మంది తలనీలాలను సమర్పించారు.
నాలుగు కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనం 3 నుంచి 5 గంటల సమయం పడుతున్నది. హుండీ ద్వారా రూ.3.88 కోట్ల ఆదాయం టీటీడీకి అందింది. కార్యక్రమంలో తిరుమల పెద్దజీయర్‌స్వామి, చిన్నజీయర్‌స్వామి, టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి దంపతులు, ఈవో ఏవీ ధర్మారెడ్డి దంపతులు, రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ఢిల్లీ స్థానిక సలహా మండలి అధ్యక్షురాలు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, బోర్డు సభ్యులు, అధికారులు పా ల్గొన్నారు. సాలకట్ల బ్రహ్మోత్సవాలు విజయవంతం అయ్యాయని టీటీడీ చైర్మన్ చెప్పారు.
సోమవారం రాత్రి అశ్వవాహన సేవ సందర్భం గా ఆయన మీడియాతో మాట్లాడారు. మంగళవారం ఉదయం చక్రస్నానం, రాత్రి ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయని వెల్లడించారు. నవరాత్రి బ్రహ్మోత్సవాలు కూడా అద్భుతంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేశామని తెలిపారు. చిన్నతనం నుంచే పిల్లల్లో భక్తిభావం పెంపొందించడానికి టీటీడీ ప్రారంభించిన ‘గోవింద కోటి’ రాసి యువత తరించాలని ఆయన పిలుపునిచ్చారు. టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డితో కలిసి చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి, ఆయన సతీమణి టీటీడీ బోర్డు మెంబర్ సీతారెడ్డి రథాన్ని లాగారు.