సూర్యాపేట : ప్రపంచ పటంలో నిలిచిన ఫణిగిరి(Phanigiri) బౌద్ధ క్షేత్రం తెలంగాణకే తలమానికమని రాష్ట్ర పురావస్తు శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజారామయ్యర్(Sailajaramaiah) అన్నారు. సూర్యాపేట జిల్లా నాగారం మండలం ఫణిగిరి గ్రామంలో 2023-24 మార్చి 11న ప్రారంభమైన తవ్వకాల్లో ఇక్ష్వాకుల కాలంనాటి మట్టి పాత్రల్లో 3,730 సీసపు నాణేలు, రాతి పూసలు, సున్నపు రాతి విగ్రహాలు లభించాయి.
ఈ సందర్భంగా వాటిని పురవాస్తు శాఖ డైరెక్టర్ భారతీ హోలికేరితో కలిసి గురువారం పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ఫణిగిరి బౌద్ధ క్షేత్రానికి తెలంగాణలో చాలా ప్రాముఖ్యత ఉందన్నారు.
భారతదేశంలో ఇంతవరకు ఎక్కడా దొరకని 3,730 నాణేలు లభించాయని తెలిపారు. ఈ నాణేలు ఒకవైపు ఏనుగు, మరోవైపు ఉజ్జయిని గుర్తులు కలిగి ఉన్నాయి.
ఇక్ష్వాకుల కాలం నాటి నాణెములుగా క్రీ.శే 2-4 శతాబ్దంగా నిర్ధారించినట్లు చెప్పారు. వీటిని వెలికితీయడంలో ఆర్కియాలజీ సిబ్బంది శ్రమ వెలకట్టలేనిదని ప్రశంసించారు. మన చారిత్రక సంపదను న్యూయార్క్లో ప్రదర్శించిన విషయాన్ని గుర్తు చేశారు. ఇది మన సంపద.
దీనిని కాపాడాల్సిన బాధ్యత మన అందరిపై ఉందన్నారు. ఈ నేలలో ఉన్నటువంటి అమరావతి, నేలకొండపల్లి వంటి బౌద్ధ సంపద ఎక్కడ కూడా లేదన్నారు. చాడలో కూడా తవ్వకాలు ప్రారంభించామని పేర్కొన్నారు. ఫణిగిరి వైభవాన్ని చూసేందుకు విదేశీ పర్యాటకులు ఎంతో ఆసక్తి కనబరుస్తున్నారని పేర్కొన్నారు.