వనపర్తి, జూన్ 29 (నమస్తే తెలంగాణ) : ఉద్యమంలో నై తెలంగాణ అన్న వ్యక్తి నేడు రాష్ర్టానికి సీఎంగా కొనసాగుతున్నారని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. వనపర్తి జిల్లా అమరచింత మండల కేంద్రంలో ఆదివారం తెలంగాణ ఉద్యమకారుడు, కళాకారుడు, దివంగత సాయిచంద్ కాంస్య విగ్రహాన్ని సాయి సతీమణి, గిడ్డంగుల సంస్థ మాజీ చైర్పర్సన్ రజినీ, మాజీ మంత్రులు నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ నవీన్‌కుమార్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, రాజేందర్‌రెడ్డి, పట్నం నరేందర్‌రెడ్డి, జైపాల్ యాదవ్, సునీత, బీఆర్ఎస్ రాష్ట్ర నేత ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్‌తో కలిసి హరీశ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బాలుర పాఠశాల మైదానంలో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ ఏ ఒక్కరోజూ ఉద్యమంలో పాల్గొనకుండా ప్రత్యేక తెలంగాణ రాష్ర్టాన్ని రేవంత్‌రెడ్డి వ్యతిరేకించారని గుర్తుచేశారు. అలాంటి వ్యక్తి సీఎం కావడం మన దౌర్భాగ్యమని మండిపడ్డారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం వల్ల పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చిందని వాపోయారు. ఆంధ్రాకు తొత్తుగా ఉండి తెలంగాణ ఉద్యమాన్ని వ్యతిరేకించిన వ్యక్తి సీఎంగా ఉండటంతో సాయిచంద్ ఆత్మ ఘోషిస్తున్నదని చెప్పారు. మళ్లీ ఉద్యమాల ద్వారానే రేవంత్‌ను ఇంటికి పంపాలని పిలుపునిచ్చారు.
రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మళ్లీ కేసీఆర్ సీఎంగా రావాలని ఆకాంక్షించారు. ఉద్యమకారుల ఆశయాలను ముందుకు తీసుకెళ్లడం ద్వారా సాయిచంద్‌కు ఘనమైన నివాళి అర్పించినట్టవుతుందని పేర్కొన్నారు. సాయిచంద్ మాట ఒక తుపాకీ తూట వంటిందని, ప్రజల జీవన స్థితిగతులపై కండ్లకు కట్టినట్టు మాటలు.. పాటలు తయారు చేసి ప్రజల హృదయాలను గెలుచుకున్నారని,తెలంగాణ ఉద్యమ సమయంలో మూడుసార్లు జైలుకు వెళ్లినా మనోధైర్యం కోల్పేలేదని గుర్తుచేశారు. రూ.కోట్లు ఆశపెట్టినా ఉద్యమాన్ని సాయి వదలలేదని, అత్యంత నిజాయితీగా నడిచి కేసీఆర్ బాటలోనే అడుగులు వేశారని తెలిపారు. రేవంత్‌రెడ్డి దుర్మార్గకు పాలనను సాయిచంద్ లాంటి ఉద్యమకారుడు బతికి ఉంటే భూమి దద్దరిల్లేలా ఉద్యమాన్ని కొనసాగించేవాడని చెప్పారు. ఇప్పటికీ సిద్దిపేటలో సాయి పాటతోనే ప్రజలు నిద్ర లేస్తారని, సాయి ఆశయాలను రజిని రూపంలో ముందుకు తీసుకెళ్తామని, బీఆర్ఎస్ ఎల్లవేళలా అండగా ఉంటుందని భరోసానిచ్చారు. మరోసారి తెలంగాణ ఉనికిని కాపాడుకునేందుకు కళాకారులు, కవులు, రచయితలు, మేధావులు ముందుకు రావాలని, తెలంగాణ రాష్ర్టాన్ని మళ్లీ నిలబెట్టుకునేందుకు ప్రజలంతా ఏకతాటిపైకి రావాలని పిలుపునిచ్చారు.
రాష్ట్రంలో దుర్మార్గ పాలన : శ్రీనివాస్‌గౌడ్
కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అత్యంత దుర్మార్గమైన పాలన సాగిస్తున్నదని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ధ్వజమెత్తారు. తెలంగాణ ఉద్యమకారులంతా మళ్లీ ఏకతాటిపైకి రావాల్సిన అవసరం వచ్చిందని చెప్పారు. సాయిచంద్ ఉద్యమ బాటలో తెలంగాణవాదులంతా ఏకం కావాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పాలనా వైఫల్యాలను ఎప్పటికప్పుడు ఎండగట్టడంతోపాటు ప్రజలకు బీఆర్ఎస్ శ్రేణులు వివరించాలని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపునకు కృషి చేయాలన్నారు.
సాయిని కేసీఆర్ ఉన్నతంగా చూడాలనుకున్నరు : లక్ష్మారెడ్డి
తెలంగాణ ప్రజల ఆకాంక్షను ఎలుగెత్తి చాటిన అసలైన ఉద్యమకారుడు సాయిచంద్ అని మాజీ మంత్రి లక్ష్మారెడ్డి కొనియాడారు. అత్యంత ఉన్నతమైన హోదాలో సాయిచంద్‌ను చూడాలని కేసీఆర్ భావించారని చెప్పారు. ‘రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా’ అనే పాటతో రాణించిన సాయి రాజకీయ ప్రస్థానంలోనూ ఎదుగుతున్న క్రమంలో అందరికీ దూరం కావడం బాధాకరమని ఆవేదన చెందారు.
సాయిచంద్ పాటను గుర్తుంచుకోవాలి :ఆర్ఎస్పీ
ఉద్యమ సమయంలో తెలంగాణ సమాజాన్ని తన గొంతుతో ఏకతాటిపైకి తెచ్చిన సాయిచంద్ పాటలను అందరూ గుర్తుంచుకోవాలని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ చెప్పారు. రాష్ట్రంలో నేడు జరుగుతున్న అన్యాయాలను చూస్తుంటే సాయిచంద్ వంటి ఉద్యమకారుడిని గుర్తుకు తెచ్చుకునే పరిస్థితులు వచ్చాయన్నారు. లగచర్ల, కాళేశ్వరం అంశాలపై మళ్లీ సాయి వంటి ఉద్యమకారుడి పాటలు రావాలన్నారు. గురుకులాల వ్యవస్థను కాంగ్రెస్ నిర్వీర్యం చేసిందని, ఇప్పటికే 90 మంది విద్యార్థులు చనిపోయినా ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదని విమర్శించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకుడు ఇంతియాజ్ ఇసాక్, ఉమ్మడి పాలమూరు జిల్లా నాయకులు, కళాకారులు పాల్గొన్నారు.
మీడియా ముసుగులో అరాచకం : నిరంజన్‌రెడ్డి
ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ప్రోత్సాహంతో కొందరు మీడియా ముసుగులో తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ధ్వజమెత్తారు. మీడియా ముసుగులో తెలంగాణపై చేస్తున్న అరాచకాలు మన సమాజానికే అత్యంత ప్రమాదకరమని హెచ్చరించారు. తెలంగాణ సమాజం మరోసారి మేల్కోవాల్సిన అవసరం ఆసన్నమైందన్నారు. సాయిచంద్ వంటి ఉద్యమకారుడి బాటలో నడుస్తూ కాంగ్రెస్ దుర్మార్గపు పాలనకు చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ ఆనవాళ్లను తుడిపేస్తామంటూ ప్రగల్భాలు పలుకుతున్న రేవంత్‌రెడ్డికి ఆంధ్రా మీడియా వత్తాసు పలుకుతున్నదని దుయ్యబట్టారు. పాలన తెలంగాణదైనా పెత్తనం ఆంధ్రా వాళ్లదన్నట్టుగా రాష్ట్రంలో పరిస్థితి ఉన్నదని నిప్పులు చెరిగారు.