జగద్గిరిగుట/రవీంద్రభారతి, డిసెంబరు 6: కాంగ్రెస్ ప్రభుత్వం రిజర్వేషన్లు ఇవ్వకుండానే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లడాన్ని తట్టుకోలేక మనోవేదనకు గురై ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మబలిదానం చేసుకున్న బీసీ బిడ్డ అనుముల సాయిఈశ్వరాచారికి పలువురు బీసీ, వివిధ సంఘాల నేతలు, స్థానికులు కడసారి కన్నీటివీడ్కోలు పలికారు. శనివారం జగద్గిరిగుట్టలోని బీరప్పనగర్‌లో సాయిఈశ్వరాచారి అంత్యక్రియలు ముగిశాయి. శాసనమండలిలో ప్రతిపక్షనేత సిరికొండ మధుసూదనాచారి, జాతీయ బీసీ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య, ఎమ్మెల్సీ కోదండరాం, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్, కార్పొరేటర్ జగన్, బీసీ నేతలు ఆయన మృతదేహం వద్ద నివాళులు అర్పించారు. కుటుంబసభ్యులను ఓదార్చి సంతాపం తెలిపారు. సాయిఈశ్వరాచారి అంత్యక్రియలకు ఏసీపీ నరేశ్‌రెడ్డి, సీఐ వెంకటేశం బందోబస్తు పర్యవేక్షించారు.
సాయిఈశ్వరాచారి ఆత్మబలిదానం ముమ్మాటికి ప్రభుత్వ హత్యనేనని, ఆయన కుటుంబాన్ని రేవంత్ సర్కారు ఆదుకోవాలని విశ్వబ్రాహ్మణ, విశ్వకర్మ మాతృసంఘం డిమాండ్ చేసింది. సాయి ఈశ్వరాచారి మృతికి కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలని, ఆయన కుటుంబానికి వెంటనే కోటి రూపాయల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేసింది. రవీంద్రభారతిలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వేముల మదన్మోహన్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఎన్నికల మ్యానిఫెస్టోలో 42% బీసీ రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి, ఇవ్వకుండానే ఎన్నికలకు వెళ్లడం బీసీలను నయవంచనకు గురిచేయడమేనని మండిపడ్డారు. సీఎం రేవంత్‌రెడ్డి అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకువెళ్లి బీసీ రిజర్వేషన్ల బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టేలా ఒత్తిడి తీసుకురావాలని కోరారు. లేకుంటే బీసీలు కాంగ్రెస్, బీజేపీలకు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. సమావేశంలో సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు లాలుకోట వెంకటాచారి, ప్రధాన కార్యదర్శి చొల్లేటి కృష్ణమాచార్యులు, కోశాధికారి రాగిఫణి రవీంద్రాచారి పాల్గొన్నారు.