హైదరాబాద్, సెప్టెంబర్ 29 (నమస్తే తెలంగాణ): సాహితీ ఇన్ఫ్రా టెక్ వెంచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ లక్ష్మీనారాయణను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఆదివారం రాత్రి అదుపులోకి తీసుకున్నది. ప్రీ లాంచ్ పేరిట ఈ సంస్థ రూ.3వేల కోట్ల స్కామ్‌కు పాల్పడినట్టు తెలిసింది. సీసీఎస్ పోలీసులు ఈ సంస్థపై ఇప్పటికే 50 కేసులు నమోదు చేయగా, తొమ్మిది ప్రాజెక్టుల పేరుతో బాధితుల నుంచి పెద్దఎత్తున డబ్బులు వసూలు చేసిందని విచారణలో వెల్లడైనట్టు సమాచారం. దీంతో రంగంలోకి దిగిన ఈడీ.. లక్ష్మీనారాయణను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నది. 2019-2022 మధ్య పలు రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుల పేరుతో ఈ సంస్థ పలువురి నుంచి రూ.వేల కోట్లు వసూలు చేసినట్టు తెలిసింది.
బజ్జీలు ఉద్దెర ఇవ్వలేదని..
కేటీదొడ్డి, సెప్టెంబర్ 29 : బజ్జీలు ఉద్దెర ఇవ్వలేదని కడాయిలో ఉన్న వేడివేడి వంట నూనెను ముఖంపై చల్లగా.. ఇద్దరు గాయపడిన ఘటన జోగుళాంబ గద్వాల జిల్లా కేటీదొడ్డి మండలం గువ్వలదిన్నెలో చోటుచేసుకుంది. ఎస్సై శ్రీనివాసులు కథనం మేరకు.. గువ్వలదిన్నెకు చెందిన బొజ్జప్పగౌడ్ బజ్జీల దుకాణం నడుపుతున్నాడు. అదే గ్రామానికి చెందిన వినోద్ మద్యం తాగి బజ్జీలు ఉద్దెర ఇవ్వాలని గొడవ చేశాడు. ఉద్దెర ఇవ్వనని బొజ్జప్పగౌడ్ చెప్పడంతో వినోద్ కడాయిలోని వేడి నూనెను బొజ్జప్పగౌడ్పై చల్లాడు. బొజ్జప్పతోపాటు పక్కనే ఉన్న వీరేశ్ ముఖంపై నూనె పడగా తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స నిమిత్తం కర్నూల్ దవాఖానకు తరలించారు. వీరేశ్ భార్య శంకరమ్మ ఫిర్యాదు మేరకు వినోద్‌పై కేసు నమోదు చేసినట్టు ఎస్సై తెలిపారు.