హైదరాబాద్, జూన్ 29 (నమస్తే తెలంగాణ): చమురు సరఫరాలో ఎలాంటి అంతరాయం కలుగకుండా భద్రతా ప్రమాణాలు పాటించాలని పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యుడు రవిచంద్ర సూచించారు. పెట్రోలియం, సహజవాయువు పార్లమెంటరీ స్థాయీ సంఘం (పార్లమెంటరీ స్టాం డింగ్ కమిటీ) తమ అధ్యయన యాత్రలో భాగంగా జమ్ముకశ్మీర్‌లోని కేంద్ర పాలిత ప్రాంతంలో పర్యటిస్తున్నది. ఇందులో భాగంగా బారాముల్లా జిల్లాలోని గుల్మార్గ్ (గౌరీమార్గ్)లో ఈ కమిటీ కీలక సమావేశం నిర్వహించింది. స్థాయీ సంఘం చైర్మన్ సునీల్ దత్తాత్రే తరరే అధ్యక్షతన జరిగిన ఈ ఉన్నత స్థాయి సమావేశంలో ఎంపీ రవిచంద్రతోపాటు పార్లమెంట్ సభ్యులు ముతిలేశ్కుమార్, డాక్టర్ వీ శివదాసన్, కేఆర్ఎన్ రాజేశ్‌కుమార్, పర్భుభాయ్ నాగర్ భాయ్ వాసవ తదితరులు పాల్గొన్నారు.
వీరితోపాటు ప్రముఖ చమురు సంస్థల ఉన్నతాధికారులు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా దేశ ఇంధన రంగానికి సంబంధించిన పలు కీలక అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. దేశం దిగుమతి చేసుకుంటున్న క్రూడాయిల్, సహజ వాయువులతోపాటు దేశీయంగా పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరల హెచ్చుతగ్గులు, వాటి స్థిరీకరణ, నియంత్రణపై చర్చించారు. ఇంధన కల్తీల నివారణ, వినియోగదారులకు నాణ్యమైన ఉత్పత్తులను సరఫరా చేయడంపై ప్రత్యేకంగా సమీక్షించారు. వినియోగదారులకు ఎప్పటికప్పుడు నాణ్యమైన సేవలు అందించేలా అధికారుల నిరంతర పర్యవేక్షణ ఉండాలని ఎంపీ రవిచంద్ర సూచించారు.