హైదరాబాద్, అక్టోబర్ 26 (నమస్తే తెలంగాణ): తెలంగాణ జెన్కో ఆధ్వర్యంలోని తాడిచర్ల-1 బొగ్గు గని బెస్ట్ ప్రాక్టీసెస్ ఇన్ సేఫ్టీ అవార్డుకు ఎంపికయ్యింది. తాడిచర్ల-1 వద్ద నిర్వహించిన 53వ యాన్యువల్ సేఫ్టీ ఫోర్ట్‌నైట్ ఉత్సవాల్లో డైరెక్టర్ జనరల్ ఆఫ్ మైన్ సేఫ్టీ, సింగరేణి సంస్థలు అవార్డును ప్రదానం చేశా యి. 52వ వార్షిక భద్రతా వారోత్సవాలు-2019లో భాగంగా ఈ అవార్డుకు ఎంపిక చేశారు. కరోనా కారణంగా ఈ అవార్డు ప్రకటన, బహూకరణ కార్యక్రమాలు వాయిదాపడుతూ వచ్చాయి. తాజాగా జరిగిన ఉత్సవాల్లో జెన్కో తరఫున చీఫ్ ఇంజనీర్ పీ బాలరాజు, జనరల్ మేనేజర్ (మైన్స్) పీ మోహన్‌రావు అవార్డు అందుకున్నారు. బుధవారం విద్యుత్తు సౌధలో ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావును కలిసి ఈ అవార్డు గురించి వివరించారు. అవార్డుకు ఎంపికపై సీఎండీ సంతోషం వ్యక్తం చేస్తూ.. ఇందుకు కృషి చేసిన జెన్కో డైరెక్టర్ (కమర్షియల్, ఫ్యూయల్) టీఆర్కే రావు బృందాన్ని అభినందించారు.