Border 2 | 1997 నాటి ఐకానిక్ వార్ డ్రామా ‘బోర్డర్’ చిత్రానికి సీక్వెల్‌గా వస్తున్న చిత్రం ‘బోర్డర్ 2’. ఈ సీక్వెల్లో సన్నీ డియోల్‌తో పాటు వరుణ్ ధావన్ (Varun Dhawan), దిల్జిత్ దోసాంజ్ (Diljit Dosanjh), అహన్ శెట్టి (Ahan Shetty) కీలక పాత్రల్లో నటిస్తుండగా.. ఈ సినిమాకు అనురాగ్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రం రిపబ్లిక్ డే కానుకగా జనవరి 26న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా మూవీ నుంచి టీజర్‌ను విడుదల చేసింది చిత్రబృందం.
ఈ టీజర్లో బాలీవుడ్ నటుడు సన్నీ డియోల్ (Sunny Deol) తన పాత మేజర్ కుల్దీప్ సింగ్ పాత్రలో తిరిగి కనిపించి అభిమానులను ఆకట్టుకున్నారు. ”మీరు ఆకాశం నుంచో, భూమి నుంచో, సముద్రం నుంచో ఎక్కడి నుంచి చొరబడాలని ప్రయత్నించినా, మీకు ముందు ఒక హిందుస్తానీ సైనికుడు నిలబడి కనిపిస్తాడు. కళ్లలోకి కళ్లు పెట్టి, ధైర్యంగా నిలబడి, దమ్ముంటే రండి, ఇదిగో హిందుస్థాన్ ఇక్కడే ఉంది అంటాడు”. అంటూ టీజర్లో సన్నీ డియోల్ చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంటుంది. టీజర్ చివర్లో, సన్నీ డియోల్ తన సైనికులను ఉద్దేశించి “మీ నినాదం ఎక్కడిదాకా వినిపించాలి?” అని అడగగా, వారు గట్టిగా “లాహోర్ దాకా!” అని జవాబివ్వడం హైలైట్‌గా నిలిచింది. ఈ చిత్రం కూడా 1971 ఇండో-పాకిస్తాన్ యుద్ధంలో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కించినట్లు మేకర్స్ తెలిపారు.