అచ్చంపేట, జూన్ 30 : అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్‌లో సఫారీ టూర్‌కు బ్రేక్ పడింది. వన్యప్రాణుల సంతానోత్పత్తికి అనుకూలంగా వాతావరణం మారుతుండటంతో జూలై ఒకటి నుంచి సెప్టెంబర్ 30 వరకు ఫర్హాబాద్ వ్యూపాయింట్, అక్కమహాదేవి గుహల సఫారీ ప్యాకేజీ సేవలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు డీఎఫ్‌వో రేవంత్‌చంద్ర తెలిపారు. అటవీలోకి జనసంచారం లేకుండా అనువైన వాతావరణాన్ని కల్పించేందుకు, వన్యప్రాణులకు ఎలాంటి అటంకాలు లేకుండా స్వేచ్ఛగా విహరించడంతోపాటు తమ సంతానోత్పత్తిని పెంచేందుకు కావాల్సిన చర్యలు చేపట్టినట్లు తెలిపారు. వన్యప్రాణులు సంచరించే ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి గట్టి నిఘా పెంచనున్నారు. ఈ మూడు నెలలపాటు నిబంధనలకు విరుద్ధంగా, అనుమతి లేకుండా నల్లమలలోకి ప్రవేశించే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయనున్నట్టు హెచ్చరించారు. అక్టోబర్ 1నుంచి నుంచి జంగిల్ సఫారీ యాత్ర పునఃప్రారంభిస్తారని తెలిపారు. యాత్రికులు, స్థానికులు అటవీశాఖ అధికారులకు సహకరించాలని కోరారు.