హైదరాబాద్ : తెలంగాణ గురుకులాల్లో చదువుతున్న విద్యార్థినులకు సురక్షితమైన వాతావరణం అందించే దిశగా సఖీ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ యత్నిస్తోంది. ఈ క్రమంలోనే గురుకులాల్లో రుతుస్రావ వ్యర్థ నిర్వహణను ప్రోత్సహించే దిశగా.. స్మోక్లెస్ సైకిల్ – పాత్ టు జీరో వెస్ట్ అనే కార్యక్రమాన్ని నార్సింగిలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో ప్రారంభించారు. ఈ పర్యావరణ హితమైన యూనిట్‌ను రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ ప్రారంభించారు.

స్మోక్లెస్ సైకిల్ – పాత్ టు జీరో వెస్ట్ అనే కార్యక్రమాన్ని నార్సింగి మున్సిపల్ కార్పొరేషన్‌తో కలిసి కేజీ రెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ, వరంగల్‌కు చెందిన ఎస్ఆర్ ఇన్నోవేషన్ ఎక్స్ఛేంజ్ మద్దతుతో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నార్సింగి మున్సిపాలిటీ కమిషనర్ టీ కృష్ణమోహన్ హాజరై విద్యార్థినుల ఆరోగ్యం, పర్యావరణ రక్షణకు మద్దతుగా స్మోక్ ఫ్రీ, ఎమిషన్ – కంట్రోల్ పరిష్కారాన్ని అందించినందుకు స్యాక్ టెక్నాలజీస్‌కు అభినందలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో సఖీ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ వ్యవస్థాపకురాలు తూటి సంధ్య, సహా వ్యవస్థాపకురాళ్లు వి వర్షిత, వి జాహ్నవి, సహ వ్యవస్థాపకుడు ఏ రాకేశ్, తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సీనియర్ సైంటిస్ట్ డాక్టర్ డబ్ల్యూజీ ప్రసన్న కుమార్‌తో పాటు పాఠశాల ప్రిన్సిపాల్ పీ సుజాత, సిబ్బంది, విద్యార్థినులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. స్మోక్లెస్ సైకిల్ ప్రోగ్రామ్ పాఠశాలలో మాసిక వ్యర్థ నిర్వహణను సులభతరం చేస్తుందని, విద్యార్థుల కోసం మరింత సురక్షితమైన వాతావరణాన్ని సృష్టిస్తుందని ఆమె అభినందించారు. సమాజ శ్రేయస్సు కోసం వినూత్న పరిష్కారాలను అందించే సఖీ టెక్నాలజీస్ సామాజిక బాధ్యతకు ఇది ఒక ప్రేరణాత్మక ఉదాహరణగా నిలిచిందని ఆమె ప్రశంసించారు.
