హైదరాబాద్, జూన్ 15 (నమస్తే తెలంగాణ): బాసర ఆర్జీయూకేటీ విద్యార్థులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని విద్యాశాఖ మంత్రి పీ సబితాఇంద్రారెడ్డి వారికి భరోసానిచ్చారు. విద్యార్థులు ప్రస్తావించిన అంశాలను ప్రభుత్వం నెరవేరుస్తుందని హామీ ఇచ్చారు. విద్యార్థులంతా ఆందోళన విరమించి గురువారం నుంచి తరగతులకు హాజరుకావాలని ఆమె సూచించారు. తమ సమస్యలను పరిష్కరించాలని కొంతకాలంగా బాసరలోని ఆర్జీయూకేటీ (ట్రిపుల్ఐటీ) విద్యార్థులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా మంత్రులకు సూచించారు. దీంతో బుధవారం సబితాఇంద్రారెడ్డి బషీర్‌బాగ్‌లోని తన కార్యాలయంలో సహచర మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, మహమూద్‌అలీ, ఉన్నతాధికారులతో ఉన్నతస్థాయి సమావేశాన్ని నిర్వహించారు.
విద్యార్థుల డిమాండ్లపై చర్చించిన మంత్రులు విద్యార్థుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తామన్నారు. ఈ సందర్భంగా మంత్రి సబితాఇంద్రారెడ్డి మాట్లాడుతూ బుధవారం నిర్మల్ జిల్లా కలెక్టర్‌ను ఆర్జీయూకేటీకి పంపించామని, అత్యవసరమనుకున్న సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించాలని సూచించామని తెలిపారు. మిగిలిన సమస్యలనూ ప్రాధాన్యక్రమంలో పరిష్కరించాలని ఇన్చార్జి వైస్‌చాన్స్‌లర్‌కు సూచించామని చెప్పారు. ప్రతిభ కలిగిన వేలాది మంది గ్రామీణ విద్యార్థులకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యను అందించేందుకు ఏర్పాటు చేసిన బాసర ఆర్జీయూకేటీ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా ఆందోళనలు చేయడం సరికాదన్నారు. ఆర్జీయూకేటీలో విద్యాప్రమాణాలను మరింత పెంచేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. త్వరలోనే మంత్రులతో కూడిన బృందం క్యాంపస్‌ను సందర్శిస్తుందని వెల్లడించారు. విద్యార్థులంతా తరగతులకు హాజరవ్వాలని, సమస్యలను పరిష్కరించేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు.
గ్రామీణ ప్రాంత విద్యార్థులు చదువుకొనే ఆర్జీయూకేటీలో రాజకీయాలొద్దని మంత్రి సబిత హితవు పలికారు. విద్యార్థుల భవిష్యత్తుతో రాజకీయాలు చేయవద్దని, మరీ ముఖ్యంగా విద్య విషయంలో విపక్షాల రాజకీయాలు తగవని అన్నారు. విద్యార్థుల డిమాండ్లు చాలా చిన్నవని పేర్కొన్న మంత్రి.. వాటిని ప్రభుత్వం పరిష్కరిస్తుందని చెప్పారు. కరోనాతో అన్ని వ్యవస్థల్లానే విద్యావ్యవస్థ కూడా ఒడిదొడుకులకు లోనయ్యిందని, ఒక్కొక్కటిగా చక్కదిద్దుతున్నామని మంత్రి తెలిపారు. విద్యాసంవత్సరం ఇప్పుడే ప్రారంభమైనందున ల్యాప్‌టాప్‌లు, యూనిఫాం త్వరలోనే అందజేస్తామన్నారు. అనవసరంగా ఆందోళన చేయవద్దని మంత్రి సబిత సూచించారు. సమీక్షలో ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి, వైస్‌చైర్మన్ ప్రొఫెసర్ వెంకటరమణ, సాంకేతికవిద్య కమిషనర్ నవీన్‌మిట్టల్, ఇన్చార్జి వీసీ రాహుల్ బొజ్జా పాల్గొన్నారు.
హైదరాబాద్, జూన్ 15 (నమస్తే తెలంగాణ) : తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆందోళనకు దిగిన బాసర ఆర్జీయూకేటీ విద్యార్థులకు మంత్రి కేటీఆర్ భరోసా ఇచ్చారు. నాణ్యమైన విద్యను అందించడంలో ఎదురవుతున్న సవాళ్లను పరిష్కరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉన్నట్టు ఆయన స్పష్టంచేశారు. విద్యార్థులు లేవనెత్తిన అంశాలను సీఎం కేసీఆర్, విద్యాశాఖమంత్రి సబితారెడ్డి దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. విద్యార్థులు ఎలాంటి ఆందోళన చెందవద్దని ట్విట్టర్ ద్వారా మంత్రి కోరారు. వర్సిటీలో మౌలిక వసతులు కల్పించాలని కోరుతూ విద్యార్థులు రోడ్డెక్కారని తేజగౌడ్ అనే విద్యార్థి మంత్రి కేటీఆర్‌కు ట్వీట్ చేయగా, మంత్రి పైవిధంగా స్పందించారు.