ఆర్మూర్‌టౌన్ , సెప్టెంబర్ 12: షరతుల్లేని రుణమాఫీ, రైతుభరోసా వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 16న ధర్నాలు నిర్వహించనున్నట్టు రైతు ఐక్య కార్యాచరణ కమిటీ ప్రతినిధులు ఇట్టడి గంగారెడ్డి, నూతుల శ్రీనివాస్, దేగాం యాదాగౌడ్, సుక్కి సుధాకర్, తిరుపతిరెడ్డి, అల్లూరి గంగారెడ్డి ప్రకటించారు. నిజామాబాద్ రూరల్, బాల్కొండ, ఆర్మూర్ నియోజకవర్గాల్లోని అన్ని తహసీల్దార్ కార్యాలయాల ఎదుట ఆందోళన చేపట్టనున్నట్టు వారు తెలిపారు. గురువారం వారు ఆర్మూర్‌లో సమావేశమై భవిష్యత్ కార్యాచరణను ప్రకటించారు.
కాంగ్రెస్ ఎన్నికల హామీ మేరకు షరతులు లేకుండా 2 లక్షల రుణమాఫీ చేయాలని, రైతు భరోసా కింద రూ.7,500 చొప్పున ఇవ్వడానికి సెప్టెంబర్ 15 వరకు తాము ఇచ్చిన గడువు దగ్గరకొస్తుందని తెలిపారు. రైతు భరోసా యాప్‌లో తెల్ల రేషన్‌కార్డు లేని రైతు కుటుంబాలను నిర్ధారిస్తున్నామని కాలయాపన చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కుటుంబ నిర్ధారణ పూర్తయిన రైతులకు ఎందుకు రుణమాఫీ చేయడం లేదని ప్రశ్నించారు. రూ.2 లక్షల పైన అప్పు ఉన్న రైతుల పరిస్థితిపై ఇప్పటివరకు స్పష్టత ఇవ్వలేదని మండిపడ్డారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఈ నెల 16న అన్ని తహసీల్దార్ కార్యాలయాల ఎదుట ధర్నా నిర్వహిస్తామని తెలిపారు.