Rythu Bandhu | గద్వాల, ఫిబ్రవరి 23 : జోగుళాంబ గద్వాల జిల్లాలోని ఓ వ్యవసాయశాఖ అధికారి చేతివాటాన్ని ప్రదర్శించారు. రైతులకు అందాల్సిన రైతుబంధు సాయం బినామీ ఖాతాల్లో జమ అయ్యేలా చక్రం తిప్పారు. దాదాపు 64 మందికి సంబంధించిన రూ.36 లక్షలను పక్కదారి పట్టించారు. బాధిత రైతు ఫిర్యాదుతో అధికారి వ్యవహారం వెలుగుచూసింది. గట్టు మండలం బలిగేర ఏఈవోగా పనిచేసిన దివ్య ప్రస్తుతం మాచర్ల వ్యవసాయ విస్తరణ అధికారిగా కొనసాగుతున్నారు. బలిగేరలో పనిచేసే సమయంలో 64 మంది అర్హులైన రైతులకు చెందిన బ్యాంకు ఖాతాల వివరాలు వ్యవసాయశాఖకు పంపకుండా బినామీ రైతుల ఖాతాలు పంపారు.
దీంతో రైతుబంధు నిధులు సుమారు రూ.36 లక్షలు ఇతరుల ఖాతాల్లో జమ అవుతున్నాయి. అసలు రైతులు తమకు సాయం నిధులు జమకావడం లేదన్నా ఎవరూ పట్టించుకోలేదు. బలిగేరికి చెందిన ఓ రైతు రాష్ట్ర వ్యవసాయశాఖ కమిషనర్‌కు ఫిర్యాదు చేయడంతో జిల్లా అధికారుల్లో చలనం వచ్చింది. రికార్డుల్లో పాస్‌బుక్ నంబర్లు సరిగా ఉన్నా నగదు ఇతరుల ఖాతాల్లో పడుతున్నట్టు గుర్తించారు. బాధ్యురాలైన దివ్యను గురువారం సస్పెండ్ చేశారు. ఈ ఘటనపై విచారణ కొనసాగుతున్న సమయంలోనే మరో వ్యవసాయ విస్తరణ అధికారి తప్పుడు సర్టిఫికెట్తో ఉద్యోగంలో చేరగా.. ఈ విషయం బయటపడటంతో ఉద్యోగి రాజీనామా చేసినట్టు తెలిసింది.