హైదరాబాద్, జూన్ 3 (నమస్తే తెలంగాణ)/నెట్వర్క్: రాష్ట్రవ్యాప్తంగా పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు శుక్రవారం ప్రజలతో కలిసి ప్రజాప్రతినిధులు, అధికారులు ర్యాలీలు చేపట్టారు. గ్రామ, వార్డు సభలు నిర్వహించి పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమం లక్ష్యాలపై అవగాహన కల్పించారు. పారిశుద్ధ్య నిర్వహణపై చైతన్య పరిచారు. గత నాలుగు విడతల్లో పల్లెప్రగతి ద్వారా సాధించిన అభివృద్ధి నివేదికలను చదివి వినిపించారు. ఇప్పటివరకు చేపట్టిన పనులు, వాటి పురోగతి, కొత్తగా చేపట్టాల్సిన పనులపై చర్చించారు. రోడ్లు, మురుగునీటి కాలువలను పరిశుభ్రం చేశారు.
వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కొత్తూరులో పల్లె ప్రగతి కార్యక్రమంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పాల్గొన్నారు. గ్రామీణ క్రీడాప్రాంగణాలను ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. ప్రజల ఆకాంక్షల నుంచి పురుడు పోసుకున్నదే పల్లెప్రగతి అని, ఈ కార్యక్రమంతో పల్లెలు పచ్చబడి తెలంగాణకు ప్రపంచస్థాయి గుర్తింపు వచ్చిందని పేర్కొన్నారు.
75 ఏండ్ల పాటు దేశాన్ని పాలించిన కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ప్రజలను ఏనాడూ పట్టించుకోలేదని విమర్శించారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నేతగా, తెలంగాణ ఉద్యమసారథిగా నాడు పల్లెల్లో తిరిగి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకొన్న సీఎం కేసీఆర్ పల్లె ప్రగతికి శ్రీకారం చుట్టారని వెల్లడించారు. టీఆర్ఎస్కు ప్రజల్లో రోజురోజుకూ పెరుగుతున్న ఆదరణ చూసి ప్రతిపక్ష నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని చెప్పారు.
మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, జడ్పీ చైర్మన్లు, ఎంపీపీలు, జెడ్పీటీసీ సభ్యులు, సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, ప్రజల భాగస్వామ్యంతో తొలిరోజు పల్లె ప్రగతి విజయవంతంగా జరిగింది. నిజామాబాద్ జిల్లా రుద్రూరు మండలం బొప్పాపూర్‌లో స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి పల్లె ప్రగతిని ప్రారంభించారు. వనపర్తి మండలం పెద్దగూడెం, అంకూరులో పల్లెప్రగతి, వనపర్తిలో పట్టణప్రగతిలో వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, నిజామాబాద్‌లోని 39వ డివిజన్లో రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి పాల్గొన్నారు.
మహబూబ్‌నగర్‌లోని 18, 38వ వార్డుల్లో ఎైక్సెజ్‌శాఖ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ పట్టణ ప్రగతిని ప్రారంభించారు. నిర్మల్ జిల్లా మామడ మండలం గాయిద్పల్లిలో దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి మొక్కలు నాటారు. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం సర్దార్‌నగర్‌లో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం పెద్దంపేటలో నిర్వహించిన ర్యాలీ, గ్రామసభలో రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌తో కలిసి మంత్రి కొప్పుల ఈశ్వర్ పాల్గొని ప్రజల సమస్యలను తెలుసుకొన్నారు.
మహబూబాబాద్‌లో పట్టణ ప్రగతి సభలో గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతిరాథోడ్ పాల్గొన్నారు. ఖమ్మం 37, 41, 52, 53వ డివిజన్లలో పట్టణ ప్రగతిలో భాగంగా మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ప్రజ ల వద్దకు వెళ్లి వారి సమస్యలు అడిగి తెలుసుకొన్నారు. కరీంనగర్‌లోని సుభాష్‌నగర్‌లో బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ పట్టణ ప్రగతి కార్యక్ర మాన్ని ప్రారంభించారు. సూర్యాపేటలో విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి, నల్లగొండ జిల్లా తిప్పర్తిలో ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు కార్యక్రమాలను ప్రారంభించారు. మంచిర్యాల జిల్లా చెన్నూర్ మండలం పొక్కూర్లో విప్ బాల్క సుమన్ పల్లె ప్రగతిని ప్రారంభించారు.
6,313 టన్నుల చెత్త తొలగింపు
527 కి.మీ. రోడ్డు పక్కల పరిశుభ్రం
411 శిథిల వ్యర్థాల తొలగింపు
660 కి.మీ. మురుగు కాల్వల పూడికతీత
331 సర్కార్ బడులు, అంగన్వాడీల శుభ్రం
349 మతపర ప్రదేశాలు, పార్కుల పరిశుభ్రం
357 ప్రాంతాల్లో ఫాగింగ్, రసాయనాల స్ప్రే
38 పనిచేయని బోర్ల మూసివేత
2415 మొక్కల పంపిణీ
4,382 మందికి నల్లా కనెక్షన్ మంజూరు
395 మీటర్ల మేర వేలాడుతున్న
విద్యుత్తు తీగల సవరింపు
44 వైకుంఠ ధామాలు పరిశుభ్రం
141 వైకుంఠధామాల పనులు ప్రారంభం
102 క్రీడాప్రాంగణాలు ప్రారంభం
55 కిలోల సింగిల్ యూజ్ ప్లాస్టిక్
సీజ్.. రూ.25వేల జరిమానా