మెదక్, మే 11(నమస్తే తెలంగాణ) : మెదక్‌లో కలెక్టర్ వర్సెస్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అన్నట్టుగా మారింది పరిస్థితి. తాము చెప్పిన పనులు చేయాలని అధికార పార్టీ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ ఒత్తిడి చేసినా కలెక్టర్ ఖాతరు చేయకపోవడమే వీరి మధ్య విభేదాలకు కారణమైంది. ఇసుక అనుమతులు, ఓ ప్రైవేట్ దవాఖాన కేసు సహా పనులపై ఎమ్మెల్యేతో పాటు ఇన్చార్జి మంత్రి సిఫార్సు చేసినా వెనక్కి తగ్గకపోవడంతో ఆగ్రహానికి గురైన కాంగ్రెస్ నేతలు.. కలెక్టర్‌ను బదిలీ చేయడమే టార్గెట్‌గా సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం, విమర్శలు గుప్పిస్తుండటం తీవ్ర చర్చనీయాంశమైంది.
వారం క్రితం మెదక్ పట్టణంలోని కేర్ హాస్పిటల్లో గర్భిణికి శిశువు జన్మించింది. అయితే శిశువు చనిపోయిందని చెప్పి దవాఖాన నిర్వాహకులు అమ్మినట్టు తల్లిదండ్రులకు తెలియడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు దవాఖానపై కేసు నమోదు చేయగా, వైద్యశాఖ అధికారులు హాస్పిటల్‌ను తాత్కాలికంగా మూసివేశారు. ఎలాగైనా కేసు నుంచి తప్పించుకునేందుకు దవాఖాన నిర్వాహకుడు ఎండీ నదీమ్, ఎమ్మెల్యే రోహిత్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరాడు. ఇక అప్పటినుంచి రంగంలోకి దిగిన ఎమ్మెల్యే, దవాఖాన కేసును పెండింగ్‌లో పెట్టాలని కోరినా కలెక్టర్ పట్టించుకోకపోవడంతో అధికార పార్టీ నాయకులకు మింగుడు పడలేదు. కలెక్టర్ తీరును మనసులో పెట్టుకొని ఎమ్మెల్యే సూచన మేరకు రైతుల పేరుతో కలెక్టరేట్ ఎదుట ఇటీవల ధర్నా చేశారు. కలెక్టర్‌ను బదిలీ చేయాలని డిమాండ్ చేశారు.
కలెక్టర్ టార్గెట్‌గా ఎమ్మెల్యే వ్యవహరిస్తున్నట్టు జరుగుతున్న పరిణామాలు చెబుతున్నాయి. కలెక్టరేట్లో ఎమ్మెల్యే చెప్పిన వ్యక్తికి ఔట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఇవ్వకుండా కలెక్టర్ పెండింగ్‌లో పెట్టినట్టు తెలిసింది. ఇక మెదక్ మున్సిపల్ పరిధిలో అభివృద్ధి పనుల కోసం హల్దీ వాగు నుంచి ఇసుక తవ్వకాలకు అనుమతి ఇవ్వాలని కలెక్టర్‌ను ఎమ్మెల్యే సిఫార్సు చేయగా, అనుమతులు ఇవ్వలేదని సమాచారం. అయితే ప్రభుత్వ పనుల పేరుతో ఇసుక తవ్వకాలు చేసి ప్రైవేట్‌గా అమ్ముకుంటారని నిఘావర్గాలు తెలుపడంతో కలెక్టర్ అనుమతులు పెండింగ్‌లో పెట్టినట్టు తెలిసింది. దీంతో తమ ఎమ్మెల్యే చెప్పినా కలెక్టర్ పట్టించుకోవడం లేదనే అక్కసుతో కాంగ్రెస్ నాయకులు కలెక్టర్‌పై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారు.
ఇసుక అనుమతులు కోసం జిల్లా ఇన్చార్జి మంత్రి వివేక్.. సిఫార్సు చేసినా, పరిశీలిస్తామని కలెక్టర్ తెలిపినట్టు సమాచారం. పెండింగ్ పనులు పూర్తి చేయకుండా కలెక్టర్ నిర్లక్ష్యం చేస్తున్నారని, సెలవుపై వెళ్లినా ఇతరులకు ఇన్చార్జి బాధ్యతలు అప్పగించలేదని మెదక్ ఎమ్మెల్యే ఆరోపిస్తున్నారు. కలెక్టర్ లేకుండానే కలెక్టరేట్లో సమీక్ష సమావేశం ఏర్పాటుచేసి జిల్లాలో పనిచేసే ఇష్టం లేకపోతే బదిలీ చేసుకొని వెళ్లిపోవాలంటూ మీడియా సమక్షంలోనే ఎమ్మెల్యే ఘాటు వ్యాఖ్యలు చేయడం విభేదాలు మరింత పెంచినట్టయ్యింది. కాంగ్రెస్ నాయకుల ధర్నా, కలెక్టరేట్లో ఎమ్మెల్యే సమీక్షపై నిఘా వర్గాలు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చినట్టు తెలిసింది.
కలెక్టరేట్లో కొందరు అధికారులు ఏండ్లుగా తిష్టవేశారు. కలెక్టర్ సీసీలు, అదనపు కలెక్టర్ సీసీలు కొన్నేండ్లుగా ఇక్కడే పాతుకుపోయారు. కలెక్టరేట్లో పెండింగ్‌లో ఫైల్స్ సమాచారం బయటకు లీక్ కావడంపై అనుమాలు వ్యక్తమవుతున్నాయి. అధికారుల పేరుతో సీసీలు భారీగా అవినీతి అక్రమాలకు పాల్పడుతునట్టు ఆరోపణలు వస్తున్నాయి. ప్రజాప్రతినిధులు, అధికారుల మధ్య విభేదాలకు కొందరు ఉద్యోగులే కారణమనే విమర్శలున్నాయి. ధాన్యం కొనుగోళ్ల కోసం కాంగ్రెస్ ధర్నా చేయడం వెనుక కొందరు అధికారుల హస్తం ఉన్నట్టు తెలుస్తున్నది.