హైదరాబాద్, సెప్టెంబర్ 1 (నమస్తే తెలంగాణ): సెంట్రలైజేషన్ పేరుతో మియాపూర్, ఉప్పల్ వర్క్‌షాపులను కరీంనగర్ తరలించడాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎస్ బాబు, ఈదురు వెంకన్న ఆర్టీసీ యాజమాన్యాన్ని డిమాండ్‌చేశారు. సోమవారం వారు మా ట్లాడుతూ.. ఆర్టీసీ సంస్థ పుట్టినప్పటి నుంచి లేని సంస్కరణలు ఇప్పుడు తీసుకురావడా న్ని వారు తప్పుబట్టారు. మియాపూర్‌లో 18ఎకరాల స్థలంలో 155మంది సిబ్బందితో బస్‌బాడీ యూనిట్‌ను నిర్వహిస్తున్నారని, ఉప్పల్‌లో 16 ఎకరాల స్థలంలో జోనల్ వర్‌షాప్, జోనల్ స్టోర్స్‌లో 355 మంది పని చేస్తున్నట్టు చెప్పారు. ఇక్కడ పనిచేసేవారంతా నైపుణ్యం గలవారని, గ్రేటర్ హైదరాబాద్ జోన్, హైదరాబాద్ జోన్‌లోని 55డిపోల బస్సులు ఈ వర్షాపునకు పూర్తిస్థాయి మరమ్మత్తులు, మెటీరియల్ కోసం వస్తున్నట్టు తెలిపారు. ఇప్పుడు వీటిని కరీంనగర్ తరలిస్తే మెటీరియల్ కోసం అక్కడికి వెళ్లడం, రావడం ఇబ్బందిగా ఉంటుందని స్పష్టంచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీ ఆస్తులను ఒక్కొక్కటిగా ప్రైవేట్ వ్యక్తులకు లీజుకు ఇవ్వడాన్ని వారు తీవ్రంగా వ్యతిరేకించారు. ఇప్పటికే ఆర్టీసీని కార్పొరేట్ సంస్థలకు అప్పగించేందుకు ప్రభుత్వం కంకణం కట్టుకున్నదని ఆరోపించారు. ఆర్టీసీపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ప్రైవేట్ ఎలక్ట్రిక్ బస్సుల ఒప్పందాన్ని బేషరతుగా రద్దు చేసుకొని బస్సులను కొనుగోలు చే యాలని డిమాండ్ చేశారు. వర్క్‌షాపుల తరలింపు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నేటి (మంగళవారం)నుంచి నల్లబ్యాడ్జీలతో నిరసనలు చేపట్టనున్నట్టు తెలిపారు.