హైదరాబాద్, ఏప్రిల్ 15 (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయాలని, యూనియన్లను పునరుద్ధరించాలని, పీఆర్సీ, ఏరియర్స్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ.. ఈ నెల 22 నుంచి ఆర్టీసీ కార్మికులు సమ్మెకు వెళ్తుండగా.. దానిని నిర్వీర్యం చేసేందుకు కొన్ని కార్మిక సంఘాలు కుట్రలు పన్నుతున్నాయని కార్మికులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. జేఏసీలో లేని కొన్ని సంఘాలు ఇటీవల వరుసగా సమావేశం అవుతుండటం పట్ల కార్మికులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా హక్కులు సాధించుకొనే క్రమంలో సమ్మెకు పిలుపునివ్వగా.. కొన్ని సంఘాలు ప్రభుత్వ పెద్దలతో లాలూచీపడి.. సమ్మెను నిర్వీర్యం చేశాయని గుర్తు చేసుకుంటున్నారు. దాంతో మరో ఏడాదిపాటు ఆగాల్సి వచ్చిందని చెప్తున్నారు. డిమాండ్లను సాధించుకొనేందుకు మళ్లీ ఆర్టీసీ కార్మికులు, సంఘాలు జేఏసీగా ఏర్పడి సమ్మెకు పిలుపునిస్తే.. అందులో కలిసిరాకుండా సొంతంగా మీటింగ్‌లు పెట్టుకోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.
ఆర్టీసీ జేఏసీలో లేని కొన్ని సంఘాల నాయకులైన అశ్వత్థామరెడ్డి (టీఎంయూ), మర్రి నరేందర్ (ఎన్ఎంయూ), హన్మంత్ ముదిరాజ్ (టీజేఎంయూ), జక్కుల మల్లేశంగౌడ్ (ఐఎన్టీయూసీ), ఆర్వీ రెడ్డి (బీఎంఎస్), పున్న హరికిషన్ (ఎస్టీఎంయూ), వెంకటేశ్వర్లు (బీఆర్టీయూ) మంగళవారం సమావేశం కావడం ప్రత్యేకత సంతరించుకున్నది. ఆర్టీసీ కార్మికుల సమస్యలపైనే చర్చించామని చెప్తున్న జేఏసీలో లేని నేతలు.. మరోసారి సమావేశమై తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు. దీనిపై ఆర్టీసీ కార్మికులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. కార్మికుల సమస్యలు పరిష్కరించడంలోనూ, సమ్మె నోటీసులు ఇవ్వడంలోనూ విఫలమైన నేతలు ప్రత్యేకంగా సమావేశం పెట్టడంపై కార్మికవర్గం తీవ్రంగా మండిపడుతున్నది. తమ ఉద్యోగాలు, కుటుంబాలు, పిల్లల భవిష్యత్తును పణంగా పెట్టి.. రోడ్లెక్కి మరీ హక్కుల సాధన కోసం ఉద్యమాలు చేస్తున్నామని కార్మికులు చెప్తున్నారు. ఈసారి కూడా కార్మికులతో కలిసిరాకుండా, ప్రభుత్వ పెద్దల పక్షానే ఉంటూ, సమ్మె నిర్వీర్యానికి ఏమైనా కుట్రలు చేస్తే.. సహించేది లేదని, భవిష్యత్తు లేకుండా చేస్తామని కార్మికులే హెచ్చరిస్తున్నారు.
సమ్మెను విజయవంతం చేయాలని కోరుతూ ఆర్టీసీ కార్మిక జేఏసీ నేతలు జిల్లాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఆయా జిల్లాల్లోని బస్ డిపోల ఎదుట ‘గేట్ మీటింగ్’లతో జోష్ పెంచుతున్నారు. సమ్మె కరపత్రాలు పంచుతూ.. కార్మికులను కార్యోన్ముఖులను చేస్తూ జోరు పెంచారు. కార్మిక జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న, వైస్ చైర్మన్ ఎం థామస్‌రెడ్డి, ఇతర జేఏసీ నేతలు బీ యాదయ్య తదితరులు యాదిగిరిగుట్ట, వరంగల్, నల్లగొండ వంటి డిపోల్లో సమ్మె సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలను కవర్ చేస్తూ.. జేఏసీ నేతలు ఆయా డిపోల నేతలతో కలిసి డిపోల ఎదుట నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. జేఏసీ నేతలు వెళ్తున్న ప్రతిచోటా కార్మికులు బ్రహ్మరథం పడుతూ.. సమ్మెకు తమ సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నారు. ఎలక్ట్రిక్ బస్‌లతో తమ భవిష్యత్తు ప్రశ్నార్థకమవుతున్న వేళ.. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాల్సిందేనని పట్టుబడుతున్నారు.