హైదరాబాద్, జనవరి 13 (నమస్తే తెలంగాణ): ఆర్టీసీలో కార్మికుల సమస్యలను తక్షణం పరిష్కరించాలని ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ నేతలు డిమాండ్ చేశారు. దశలవారీ పోరాటాల్లో భాగంగా ఈనెల 14 నుంచి 19 వరకు పోస్టుకార్డు ఉద్యమానికి శ్రీకారం చుట్టినట్టు చెప్పారు. మంగళవారం ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని ఎంప్లాయీస్ యూనియన్ కేంద్ర కార్యాలయంలో జేఏసీ నేతలు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కార్మికుల సమస్యలు, ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం, ఆర్టీసీ సంస్థ ఆధ్వర్యంలోనే ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణ వంటి అంశాలపై చర్చించారు. ప్రభుత్వం సమస్యలను పరిష్కరించడంలో తీవ్ర జాప్యం చేస్తుండటం వల్ల కార్మికులందరూ ప్రభుత్వానికి పోస్టుకార్డుల రూపంలో సమస్యలు విన్నవించాలని తీర్మానించారు. పోస్టుకార్డులో పొందుపర్చాల్సిన సమస్యలను, నమూనాను సైతం వారు ప్రస్తావించారు.
అందులో ప్రధానంగా 5 సమస్యలను కార్మికులందరూ కార్డుల్లో రాయాలని సూచించారు. 2023 ఎన్నికల సందర్భంగా అభయహస్తం మ్యానిఫెస్టోలో భాగంగా ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చి మోసం చేసిందని మండిపడ్డారు. తక్షణమే 2021 వేతన సవరణ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఎలక్ట్రిక్ బస్సులను ప్రభుత్వమే ఆర్టీసీకి కొని ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా దశలవారీగా ప్రభుత్వంపై పోరాడేందుకు సిద్ధమైనట్టు ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న, వైస్ చైర్మన్ ఎన్ కమలాకర్‌రెడ్డి, కో కన్వీనర్లు కత్తుల యాదయ్య, బీ యాదగిరి చెప్పారు. ఈ క్రమంలో 19న పోస్టుకార్డు ఉద్యమం, 20న రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులు అందరూ ఎర్రబ్యాడ్జీలు(రిబ్బన్లు) ధరించి ‘పోరాట దినం’ పాటించాలని పిలుపు ఇచ్చారు. సమావేశంలో జే రాఘవులు, కే రామిరెడ్డి(ఈయూ), బీ యాదయ్య కోశాధికారి, సీ సత్తయ్య, ఎం హెచ్ ఆలీ, బుద్ధ విశాల్, జీ రాములు(బీకేయూ), రాంచందర్, బీ శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు.