హైదరాబాద్, ఆగస్టు 28 (నమస్తే తెలంగాణ): ఆర్టీసీ భూములను ప్రభుత్వానికి అప్పనంగా ముట్టజెప్తున్న అంశంపై నిగ్గు తేల్చాలని ఆర్టీసీ కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. కార్మికులు, సంస్థకు చెందిన భూములను ప్రభుత్వానికి ధారాదత్తం చేస్తామంటే ఊరుకునేది లేదని హెచ్చరిస్తున్నారు. ఆర్టీసీ ఆస్తులను ప్రభుత్వానికి ఏకపక్షంగా ఇస్తున్న వైనంపై కొందరు కార్మికులు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేయనున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఆర్టీసీ భూములకు ప్రభుత్వం ఎసరు పెడుతున్న వైనంపై ‘నమస్తే తెలంగాణ’ వరుసగా రాస్తున్న కథనాలకు ఆర్టీసీకి చెందిన పలు యూనియన్లు శుక్రవారం స్పందించాయి.
ఆర్టీసీ భూములను ప్రభుత్వం తీసుకొని ప్రజలకు ఇండ్ల నిర్మాణం చేస్తుందని, రాజధాని నడిబొడ్డున ఉన్న హైదరాబాద్-3వ డిపో, కాచిగూడలోని పాత క్వార్టర్స్ స్థలం ప్రభుత్వం తీసుకొంటుందని, అందుకు ఆర్టీసీ యాజమాన్యం కూడా పాక్షికంగా అంగీకరించిందని వస్తున్న వార్తలతో ఆర్టీసీ కార్మికులు తీవ్ర ఆందోళన చెందుతున్నారని, దానిపై యాజమాన్యం తక్షణం స్పందించాలని స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ (సీఐటీయూ అండ్ ఏఐఆర్టీడబ్ల్యూఎఫ్) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది.
ఆర్టీసీ యాక్ట్ -1950కి లోబడి ఆర్టీసీ సంస్థ ఏర్పడిందని, చట్టప్రకారం ఆర్టీసీ ఆస్తులు/భూములను ఏ రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా తీసుకోవడం కుదరదని ఎస్‌డబ్ల్యూఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వీరాంజనేయులు, వీఎస్ రావు అన్నారు. రాష్ట్ర ఆవిర్భావం సందర్భంగా 9వ షెడ్యూల్లోని ఉమ్మడి ఆస్తుల విభజనకు షీలాబిడే కమిటీని కేంద్ర ప్రభుత్వం నియమించిందని గుర్తుచేశారు. ఇప్పటివరకు ఉమ్మడి ఆస్తుల విభజన పూర్తికాలేదని, అయినప్పటికీ కొన్ని నెలల క్రితం ఏపీఎస్ఆర్టీసీకి కేటాయించిన ఆర్టీసీ బస్ భవన్‌లోని ‘ఏ’ బ్లాక్‌ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా జీఎస్టీ డిపార్ట్మెంట్కు ఇచ్చినట్టు ఉత్తర్వులు ఇస్తే.. ఏపీ అధికారులు వచ్చి ఆ ఆస్తిని తిరిగి స్వాధీనం చేసుకున్న విషయాన్ని శుక్రవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో గుర్తు చేశారు. ఇపుడు ఆర్టీసీ బస్ డిపోలను ఖాళీ స్థలం పేరుతో రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలని ప్రయత్నం చేయడం సరైందికాదని, ఆర్టీసీ భూములు/ఆస్తులు ఆర్టీసీకే ఉండేలా చూడాలని ఎస్‌డబ్ల్యూఎఫ్ రాష్ట్ర కమిటీ తరఫున కోరారు.
ఏప్రిల్‌లో జరిగిన ఆర్టీసీ సమ్మె సమయంలో ప్రభుత్వ అధికారుల కమిటీ, మంత్రివర్గ ఉపసంఘంతో జరిగిన చర్చల సమయంలో ఆర్టీసీని విస్తరిస్తామని చెప్పి.. ఇప్పుడు ఆ భూములను ఎలా తీసుకుంటారని పలు యూనియన్ల నేతలు ప్రశ్నిస్తున్నారు. బస్‌ల సంఖ్య పెంచుతామని, అందుకు అనుగుణంగా క్యూర్ పరిధిలో 20 కొత్త డిపోలు నిర్మిస్తామని, స్థలం సేకరిస్తున్నామని, ఆర్టీసీని ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటీకరించబోమని హామీ ఇచ్చిన ప్రభుత్వం, దొడ్డిదారిలో భూములు తీసుకోవడం ఏందని నిలదీస్తున్నారు. భూములను రక్షించుకోవాలని ఎస్‌డబ్ల్యూఎఫ్ పిలుపునిచ్చింది. అవసరమైతే ఆర్టీసీ ఆస్తుల పరిరక్షణకు అన్ని సంఘాలతో కలిసి ఉద్యమిస్తామని హెచ్చరించింది.