హైదరాబాద్, జూన్ 11 (నమస్తే తెలంగాణ): ఆర్టీసీ రిటైర్డ్ కార్మికులు పెండింగ్ బకాయిలపై ‘ఒక్కరోజు ఉపవాస దీక్ష’కు పిలుపునిచ్చారు. కొన్నేండ్లుగా బకాయి ఉన్న రిటైర్మెంట్ పెన్షన్ స్కీమ్ (ఆర్పీఎస్)-2017, 2021 ఏరియర్స్, లీవ్ ఎన్క్యాష్మెంట్లు, గ్రాట్యుటీ డిఫరెన్స్ డబ్బులు రిటైర్ అయిన వారందరికీ అర్హత చొప్పన ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. తమకు రావాల్సిన వాటిని ఇప్పించాలని ఎంతమంది దగ్గరకు వెళ్లినా పట్టించుకోవడం లేదని తెలంగాణ ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల సారథ్య కమిటీ చెబుతున్నది.
వివిధ కారణాలతో తిరసరించిన పీఎఫ్ అప్లికేషన్లు సరిచేయడం లేదని మండిపడుతున్నారు. రిటైర్ అయినవారికి పెన్షన్ సాంక్షన్ కావడం లేదని, కొందరికి డిమాండ్ నోటీసులు రావడం లేదని చెప్తున్నారు. 2013, 2017 వేతన సవరణ వివరాలను పీఎఫ్ కమిషనర్‌కు పంపకపోవడం వల్ల హయ్యర్ పెన్షన్ ఆగిపోయిందని కన్నీటి పర్యంతమవుతున్నారు. రిటైర్డ్ ఉద్యోగులందరి సలహాలు, సూచనల మేరకు జూన్ 18న బస్‌భవన్ వద్ద 10వేల మందికి పైగా ఒకరోజు ఉపవాస దీక్షలో పాల్గొంటారని తెలంగాణ ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల సారథ్య కమిటీ తెలిపింది.