హైదరాబాద్, నవంబర్ 19 (నమస్తేతెలంగాణ): ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయడంతో పాటు, కార్మికుల పెండింగ్ సమస్యలన్నింటినీ పరిష్కరించాలని ఆర్టీసీ మెజారిటీ యూనియన్ల జేఏసీ చైర్మన్ అశ్వత్థామరెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం హైదరాబాద్‌లోని టీఎంయూ యూనియన్ ఆఫీస్‌లో ఆర్టీసీ యూనియన్ల సమావేశం అశ్వత్థామరెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా అశ్వత్థామరెడ్డి మాట్లాడుతూ.. డిసెంబర్ 9లోగా ఆర్టీసీని విలీనం చేయడంతో పాటు, ఇతర పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ప్రత్యక్ష పోరాటానికి దిగాలని నిర్ణయించామని తెలిపారు.
ఆర్టీసీ, ఎస్‌హెచ్‌జీ మధ్య అద్దెబస్సుల ఒప్పందం
హైదరాబాద్, నవంబర్ 19 (నమస్తేతెలంగాణ) : మహిళా శక్తి పథకం కింద స్వయం సహాయక బృందాల ద్వారా టీజీఎస్ఆర్టీసీ తీసుకుంటున్న అద్దె బస్సుల ఒప్పందాన్ని ఉన్నతాధికారులు కుదుర్చుకున్నారు. వరంగల్‌లో మంగళవారం జరిగిన ప్రజాపాలన విజయోత్సవ సభలో ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఇతర మంత్రుల సమక్షంలో ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్, సెర్ప్ సీఈవో దివ్యా దేవరాజన్ ఒప్పంద పత్రాలు మార్చుకున్నారు. ఈ విషయాన్ని ఆర్టీసీ ఎండీ ఎక్స్ ద్వారా వెల్లడించారు.