హైదరాబాద్, మార్చి 21 (నమస్తే తెలంగాణ): ఆర్టీసీ ఉద్యోగుల ఎన్నో ఏండ్ల కల.. కలగానే మిగిలిపోనున్నదా? ఆర్టీసీని, ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయడానికి ఈ ఏడాది కూడా ప్రభుత్వానికి మనసు రావడం లేదా? మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కార్మికుల కలను సాకారం చేసే దిశగా ముందుకెళ్తే.. కాం గ్రెస్ ప్రభుత్వం ఆ కలను కల్ల చేసేందుకు ప్ర యత్నిస్తున్నదా? అంటే అవుననే అంటున్నారు ఆర్టీసీ కార్మికులు. నాడు ముఖ్యమంత్రిగా ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను స్వయంగా విన్న కేసీఆర్.. ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేసే అంశంపై సాధ్యాసాధ్యాలు పరిశీలించి.. అసెంబ్లీలో బిల్లు పెట్టారు. ఉభయసభల్లో ఆ బిల్లును పాస్ చేయించి, గవర్నర్ వద్దకు పంపారు. నాటి గవర్నర్ ఆ బిల్లును ఆమోదించకపోతే.. ఆర్టీసీ కార్మికులు, యాజమాన్యాన్ని రాజ్‌భవన్‌కు పంపి ఆ బిల్లుకు ఆమోదం తెలిపేలా కృషి చేశారు. చివరికి అపాయింటెడ్ డే కూడా ప్రకటిస్తే.. ఎన్నికల కోడ్ ఆ కార్యాన్ని అడ్డుకున్నది. అప్పుడే ‘కేసీఆర్ చేసిందేంది? మేమే అపాయింటెడ్ డే ప్రకటిస్తాం. ఆర్టీసీని విలీనం చేస్తాం’ అంటూ మ్యానిఫెస్టోలో ప్రగల్భాలు పలికిన కాంగ్రెస్ నేతలు రెండున్నరేండ్లు గడిచినా ఆ ఊసే ఎత్తడం లేదని కార్మికులు ఆగ్ర హం వ్యక్తంచేస్తున్నారు. ఈ బడ్జెట్లోనైనా అధికంగా నిధులు కేటాయించి ఆర్టీసీని విలీనం చేస్తారేమోనని ఆశించిన కార్మికులకు ఈసారి కూడా మొండిచెయ్యే ఎదురైంది.
ప్రతినెలా రూ.500 కోట్లు అవసరం..
ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చుకునే మార్గాలు తెలియకపోవడంతో ఆర్టీసీ విలీనం దాదాపుగా ఆగిపోయిందని స్వయంగా ఆ సంస్థ వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి. ఆర్టీసీ విలీన ప్రక్రియ నానాటికీ ఆలస్యమవుతుండటంతో కార్మిక సంఘాల నేతలు రెండోసారి సమ్మె సైరన్ మోగించారు. అపాయింటెడ్ డే ప్రకటిస్తే.. ఆ నెల నుంచి ప్రతినెలా అదనంగా ప్రభుత్వానికి రూ.500 కోట్ల వరకూ అవసరం అవుతుందని నిపుణులు చెప్తున్నారు. అంత ఆర్థిక భారాన్ని మోసే స్థితి ప్రభుత్వానికి లేకపోవడంతో.. ఈ విలీన ప్రక్రియను ప్రస్తుతం పక్కన పెట్టినట్టు తెలిసింది. ఆర్టీసీ నుంచి వచ్చే ఆదాయం ప్రతినెలా రూ.300 కోట్లకు మించకపోవడంతో ఆ సంస్థకు నిధులు ఇవ్వడమే దండగనే కోణంలో ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో 2026-27 బడ్జెట్లో ఆర్టీసీకి మహాలక్ష్మి ఉచిత ప్ర యాణం కింద ఇవ్వాల్సిన రీయింబర్స్మెంట్ తప్ప.. ఒక్క రూపాయి కూడా అదనంగా కేటాయించలేదు.
అప్పులు, రాయితీల భారం ఆర్టీసీదేనా?
ఆర్టీసీకి ప్రభుత్వం గత మూడు బడ్జెట్లలో ఒక్క రూపాయి కూడా ఆర్థికంగా సహకారం అందించకపోవడంతో అది అప్పులు ఊబిలో కొట్టుమిట్టాడుతున్నది. ఇప్పటికే సుమారు రూ.3వేల కోట్ల వరకూ అప్పులు చేసింది. విడుతల వారీగా చేసిన అప్పులకు కూడా ప్రభుత్వం నుంచి డబ్బులు రాకపోవడంతో.. వాటిని తీర్చుకునే భారం ఆర్టీసీనే మోస్తున్నది. ఈ అప్పులకు తోడు మహాలక్ష్మి పథకానికి ప్రభుత్వం నుంచి ప్రతినెలా రావాల్సిన బకాయిలు రూ.2,500 కోట్ల వరకు పెండింగ్ ఉన్నాయి. అవి కూడా విడుదల చేయలేదు. దీంతోపాటు 666 కొత్త బస్సుల కొనుగోలుకు రూ.241.37 కోట్లు కావాలి.. వాటికి కూడా ఒక్క రూపాయి ఇవ్వలేదు. ఆర్టీసీకి ఎలక్ట్రిక్ బస్‌లు వస్తుండటంతో ఇక కొత్త బస్సుల కొనుగోళ్లు లేవని స్పష్టమవుతున్నది. రుణాల చెల్లింపులకు రూ.855.01 కోట్లు అవసరం కాగా.. ఆ దిశగా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. గత ప్రభుత్వం ఆర్టీసీకి రుణాల కింద ఏటా రూ.900 కోట్లు కేటాయించింది. కొత్తగా బస్ డిపోలు, బస్స్టేషన్ల నిర్మాణానికి రూ.406 కోట్లు అవసరం కాగా.. వాటిని కూడా ప్రభు త్వం పట్టించుకోలేదు. దీంతో జర్నలిస్టులు, విద్యార్థులు, దివ్యాంగుల బస్‌పాస్‌ల రాయితీల భారం కూడా ఆర్టీసీపైనే పడనున్నది.
రూ.15 వేల కోట్లు ఇచ్చి ఆదుకోండి
ప్రభుత్వం ఆర్టీసీకి నిధులు ఇవ్వకపోవడం దారుణం. బడ్జెట్లో ఆర్టీసీని విస్మరించడమంటే.. కార్మికులను అవమానించడమే. కేవలం మహాలక్ష్మి పథకానికి మాత్రమే డబ్బులు కేటాయించి.. మిగతా బస్‌పాస్‌ల రాయితీ డబ్బులు కూడా ఆర్టీసీపైనే వేయడం దారుణం. అప్పులు, వాటి వడ్డీలకు కూడా నిధులు కేటాయించలేదు. ఈ బడ్జెట్లో ఆర్టీసీ విలీనం గురించి ప్రస్తావిస్తారేమోనని ఆశించాం. అందులోనూ నిరాశపర్చారు. ఇక సమ్మె అనివార్యమని తెలుస్తున్నది. ప్రభుత్వం రివైజ్డ్ బడ్జెట్లోనైనా రూ.7,300 కోట్లు ఆర్టీసీకి ఇవ్వాలి. అన్ని రాయితీలు, అప్పులుతీర్చేందుకు తక్షణమే ఆర్టీసీకి రూ.15వేల కోట్లు మంజూరు చేయాలి. – ఈదురు వెంకన్న, ఆర్టీసీ కార్మిక జేఏసీ చైర్మన్