హైదరాబాద్, జూలై 20 (నమస్తే తెలంగాణ): టీఎస్ ఆర్టీసీలోని అన్ని కార్మిక సంఘాల ట్రేడ్ యూనియన్లను పునరుద్ధరించాలని, ఈ మేరకు లేబర్ కమిషనర్‌కు ఈ నెల 24లోపు లేఖలు అందజేయాలని వివిధ కార్మిక సంఘాల నేతలు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లోని ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ కార్యాలయంలో శనివారం జరిగిన ట్రేడ్ యూనియన్ల సమావేశంలో ఈయూ నేతలతోపాటు థామస్‌రెడ్డి (టీఎంయూ), జీఆర్ రెడ్డి (ఎస్‌డబ్ల్యూఎఫ్), ఎండీ మౌలానా (ఎన్ఎంయూ) తదితరులు మాట్లాడారు. అన్ని ట్రేడ్ యూనియన్ల నేతలు సమిష్టిగా వెళ్లి లేబర్ కమిషనర్‌పై జాయింట్ మీటింగ్ కోసం ఒత్తిడి తేవాలని నిర్ణయించారు.
ట్రేడ్ యూనియన్ల స్థానంలో ఎంప్లాయీ వెల్ఫేర్ బోర్డులను ఏర్పాటుచేయడం చట్టవిరుద్ధమని, కార్మిక సమస్యలను పరిషరించలేని బోర్డులు ఎందుకని ప్రశ్నించారు. కార్మికులపై విపరీతమైన పనిభారం పెరిగిందని, వారిపై యాజమాన్యపు వేధింపులు ఎకువయ్యాయని ఆందోళన వ్యక్తంచేశారు. కాంగ్రెస్ ఎన్నికల మ్యానిఫెస్టోలో ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలను అధికారం చేపట్టి ఏడు నెలలైనా ఎందుకు అమలుచేయడం లేదని నిలదీశారు. కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే రాబోయే రోజుల్లో ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో మరో సుదీర్ఘ పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. సమావేశంలో తెలంగాణ ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షుడు ఎస్ బాబు, వర్కింగ్ ప్రెసిడెంట్ మహ్మద్ అహ్మద్ అలీ, ఉపాధ్యక్షుడు ఎన్ బాల్‌రెడ్డి, ఉపప్రధాన కార్యదర్శులు పీ అప్పారావు, జే రాఘవులు పాల్గొన్నారు.