Mahalakshmi Scheme | మహాలక్ష్మీ పథకంలో భాగంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు జీరో టికెట్ బదులు ఉచిత బస్ పాస్ కార్డు ఇవ్వాలని నిర్ణయించడం పట్ల ఆర్టీసీ జేఏసీ హర్షం వ్యక్తం చేసింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన ఆర్టీసీ సమీక్ష సమావేశంలో ఈ నిర్ణయం తీసుకోవడాన్ని స్వాగతిస్తున్నామని తెలిపింది.
మహాలక్ష్మీ పథకం అమలులో భాగంగా ఆర్టీసీ బస్సుల్లో రద్దీ పెరగడంతో మహిళలకు జీరో టికెట్ జారీ చేసే సమయంలో కండక్టర్లు కొంత గందరగోళానికి గురవుతున్నారని.. పురుషులకు కూడా పొరపాటున జీరో టికెట్లు ఇస్తుండటంతో వారిని ఉద్యోగంలో నుంచి తీసేస్తున్నారని ఆర్టీసీ జేఏసీ తెలిపింది. ఈ క్రమంలోనే జీరో టికెట్ బదులు ఉచిత బస్ పాస్ కార్డు ఇవ్వాలని డిమాండ్ చేశామని గుర్తుచేసింది. దీనిపై ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యాల దృష్టికి జేఏసీ తీసుకెళ్లిందని తెలిపింది. మే 6న రవాణా శాఖ మంత్రితో జరిగిన సమావేశంలోనూ దీని గురించి ప్రస్తావిస్తే సానుకూలంగా స్పందించారని చెప్పింది. ఈ క్రమంలోనే భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో జరిగిన ఆర్టీసీ సమీక్షా సమావేశంలో ఉచిత బస్ పాస్ కార్డు ఇవ్వాలని నిర్ణయించడం పట్ల హర్షం వ్యక్తం చేసింది.