నమస్తే తెలంగాణ నెట్వర్క్, ఆగస్టు 1: మానవీయ కోణంలో సుపరిపాలన కొనసాగిస్తున్న ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుకు సబ్బండ వర్ణాల ప్రజలు జేజేలు పలుకుతున్నారు. సోమవారం క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాలపై రాష్ట్రవ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతున్నది. మనసున్న ముఖ్యమంత్రి కేసీఆర్ అని నినదిస్తూ, సంబురాలు జరుపుకొన్నారు. క్యాబినెట్ నిర్ణయాలపై హర్షం వ్యక్తంచేస్తూ మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా సీఎం కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకాలు, పుష్పాభిషేకాలు చేశారు. పటాకులు కాల్చి, మిఠాయిలు పంచుకొన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంపట్ల ఆర్టీసీ ఉద్యోగులు, సిబ్బంది, కార్మికులు పెద్ద ఎత్తున సంబురాలు జరుపుకొన్నారు.
Rtc
అన్ని బస్ డిపోల ఎదుట సీఎం కేసీఆర్, మంత్రి పువ్వాడ, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్‌ల చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. గతంలో ఏ ప్రభుత్వాలు తీసుకోని చరిత్రాత్మక నిర్ణయం సీఎం కేసీఆర్ తీసుకున్నారని.. ఇకపై రెట్టించిన ఉత్సాహంతో విధులు నిర్వహించి, ఆర్టీసీని మరింత బలోపేతం చేస్తామని కార్మికులు ముక్తకంఠంతో నినదించారు. బీఆర్ఎస్ అనుబంధ బీఆర్టీయూ కార్మిక సంఘం ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని బస్‌భవన్ ఎదుట సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఎవరూ ఊహించని విధంగా సీఎం కేసీఆర్ 43 వేల మంది ఆర్టీసీ కార్మికుల భష్యత్తుకు బాటలు వేసే సాహసోపేత నిర్ణయం తీసుకున్నారని బీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు జీ రాంబాబుయాదవ్, కనీస వేతనాల అమలు కమిటీ చైర్మన్ నారాయణ పేర్కొన్నారు.
ఆర్టీసీ కార్మికుల చిరకాల కోరిక నెరవేర్చిన సీఎం కేసీఆర్‌కు ఆర్టీసీ జేఏసీ చైర్మన్ అశ్వత్థామరెడ్డి ధన్యవాదాలు తెలిపారు. మహబూబ్‌నగర్‌లో ఆర్టీసీ సిబ్బంది మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ను కలిసి కృతజ్ఞతలు చెప్పారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం పట్ల తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం (టీజీవో) హర్షం వ్యక్తం చేసింది. అటు బీడీ టేకేదార్లకు ఆసరా తరహా పింఛన్లు ఇస్తామని తీసుకున్న నిర్ణయంపై బీడీ టేకేదార్లు రాష్ట్రవ్యాప్తంగా వేడుకలు జరుపుకొన్నారు. సీఎం కేసీఆర్ ఫ్లెక్సీలకు క్షీరాభిషేకాలు చేశారు. ఖమ్మం నగరంలోని మున్నేరుకు ఇరువైపులా రక్షణ గోడలు నిర్మాణానికి రూ.150 కోట్లు మంజూరు చేయడంపట్ల నగర వాసులు హర్షం వ్యక్తం చేశారు.
Rtc2
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంపట్ల హర్షం వ్యక్తం చేస్తూ జగిత్యాల డిపోలో ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి పువ్వాడ అజయ్, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్‌ల చిత్రపటానికి బిడ్డతో కలిసి క్షీరాభిషేకం చేస్తున్న మహిళా కండక్టర్
ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయడం ద్వారా సీఎం కేసీఆర్ కార్మిక కుటుంబాల్లో వెలుగులు నింపారు. ప్రభుత్వ నిర్ణయంతో 43,373 మంది కార్మికులు ప్రభుత్వ ఉద్యోగులుగా మారారు. సీఎం కేసీఆర్‌కు టీజీవో తరఫున కృతజ్ఞతలు.
– వీ మమత, టీజీవో అధ్యక్షురాలు
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడాన్ని స్వాగతిస్తున్నాం.కార్మికుల చిరకాల కోరిక ను బీఆర్ఎస్ ప్రభుత్వం నెరవేర్చింది. విధి విధానాల కమిటీ ఈ ప్రక్రియను పూర్తి చేసి ఉద్యోగులుగా తీసుకోవాలి. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞతలు.
-టీఎస్ఆర్టీసీ జేఏసీ చైర్మన్ అశ్వత్థామరెడ్డి
Rtc4