హైదరాబాద్, మే 9 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ ఉద్యోగుల్లా ఆర్టీసీ సిబ్బందికి కూడా మాస్టర్ స్కేలు ఇవ్వాలని ఎస్‌డబ్ల్యూఎఫ్ కోరింది. ఈ మేరకు 2021 పీఆర్సీ ఒప్పందంపై ప్రతిపాదనలు సిద్ధం చేసినట్టు ఎస్‌డబ్ల్యూఎఫ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వీరాంజనేయులు, వీఎస్‌రావు శనివారం వెల్లడించారు. ప్రస్తుతం 8 ఏండ్ల తర్వాత మారుతున్న ఇంక్రిమెంట్ రేటును ఇకపై ప్రతి మూడేండ్లకోసారి మార్చడంతోపాటు ఆ రేటును సమీప వంద రూపాయలకు సవరించాలని, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా ఆర్టీసీలో కూడా 6, 12, 18, 24, 30 ఏండ్లకు స్టాగ్నేషన్ ఇంక్రిమెంట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ప్రకటించినట్టుగా 2017, 2021 వేతన సవరణలకు సంబంధించిన బకాయిలను రిటైర్మెంట్ తర్వాత చెల్లిస్తే ఆర్టీసీ కార్మికులకు తీవ్ర నష్టం జరుగుతుందని, ఆ వేతన సవరణల వల్ల వచ్చిన ఆర్థిక ప్రయోజనాలు అందకుండా పోతాయని ఆవేదన వ్యక్తం చేశారు.
దీన్ని దృష్టిలో పెట్టుకుని 2017, 2021 వేతన సవరణ బకాయిలను మూడేండ్ల తర్వాత వడ్డీతో కలిపి చెల్లించే విధంగా బాండ్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 2017 వేతన సవరణతో అనేక క్యాడర్లలో వేతన వ్యత్యాసాలు (పే అనామలీస్) వచ్చాయని, జూనియర్లు, సీనియర్లు ఒకే మూలవేతనం (బేసిక్ పే)లో ఫిక్స్ అయ్యారని పేర్కొంటూ.. ఈ లోపాలను 2021 వేతన సవరణలో సరిచేయాలని కోరారు. ప్రభుత్వంలో ఆర్టీసీ కార్మికుల విలీనం సందర్భంగా డ్రైవర్, కండక్టర్, మెకానిక్, డిప్యూటీ సూపరింటెండెంట్ లాంటి క్యాడర్లు లేకపోవడం వల్ల కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉన్నదని తెలిపారు. వాటిని నిరోధించేందుకు 2021 వేతన సవరణలోనే కొన్ని క్యాడర్ల సేల్స్‌ను అప్‌గ్రేడ్ చేయాలని, కొత్తగా అసిస్టెంట్ మేనేజర్ సేల్‌ను రూపొందించాలని విజ్ఞప్తి చేశారు. 2017 వేతన సవరణ సందర్భంగా అలవెన్సులను సవరించకపోవడంతో ఆర్టీసీ కార్మికులు గత 9 ఏండ్లలో రూ.450 కోట్ల నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేస్తూ.. ఇప్పటికైనా 2017, 2021 అలవెన్సులను 200% పెంచి కార్మికులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
ఆర్టీసీ సూపర్వైజర్ ట్రైనీ జాబితా విడుదల : శ్రీనివాసరావు
హైదరాబాద్, మే 9 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో ఖాళీగా ఉన్న 198 ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనీ (టీఎస్టీ), మెకానికల్ సూపర్వైజర్ ట్రైనీ (ఎంఎస్టీ) పోస్టుల భర్తీకి ఎంపికైన అభ్యర్థుల వివరాలను రాష్ట్రస్థాయి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ వీవీ శ్రీనివాసరావు శనివారం ఒక ప్రకటనలో వెల్లడించారు. నిరుడు డిసెంబర్ 25న విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం నిర్వహించిన రాత పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన వారికి, ధ్రువపత్రాల పరిశీలన అనంతరం ఎంపిక పూర్తి చేసినట్టు పేరొన్నారు. మొత్తం 84 ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనీ పోస్టులకు 62మంది పురుషులు, 22మంది మహిళలు ఎంపికయ్యారని తెలిపారు. 114 మెకానికల్ సూపర్వైజర్ ట్రైనీ పోస్టుల్లో 79మంది పురుషులు, 33మంది మహిళలతో కలిపి 112 ఖాళీలు భర్తీ చేసినట్టు వెల్లడించారు. తగిన అర్హతలు లేకపోవడంతో మెకానికల్ విభాగంలో రెండు పోస్టులు భర్తీ కాలేదని వివరించారు. ఎంపికైన అభ్యర్థుల వివరాలు www.tgprb.inలో ఉంచినట్టు తెలిపారు. అభ్యర్థులు ఈనెల 13న ఆన్లైన్ ఫారాన్ని పూర్తిచేయాలని ఆయన సూచించారు.