హైదరాబాద్, ఏప్రిల్ 4 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ పాలనలో ఆర్టీసీ ఉద్యోగులకు సకాలంలో వేతనాలు అందడం లేదు. ‘ఈ నెల జీతం ఇవ్వండి మహాప్రభో’ అంటూ ఇతర శాఖల ఉద్యోగుల మాదిరిగానే వారు కూడా వేయి కండ్లతో ఎదురుచూస్తున్నారు. ‘మహాలక్ష్మి’ పథకం ద్వారా ఆర్టీసీకి బాగా లాభాలు వచ్చాయని అటు ప్రభుత్వం, ఇటు సంస్థ యాజమాన్యం చెప్తున్నప్పటికీ ఉద్యోగులకు మాత్రం ప్రతి నెలా 1న వేతనాలు ఇవ్వడం లేదు. నిజంగానే ఆర్టీసీకి లాభాలు వస్తే సకాలంలో జీతాలు ఎందుకు ఇవ్వడం లేదని, కెనరా, యూనియన్ బ్యాంకులతో చేసుకున్న ఒప్పందం ఏమైందని కార్మికులు ప్రశ్నిస్తున్నారు.
అందరికీ ఒకేసారి ఇవ్వలేక..
ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధు లు విడుదల కాకపోవటంతో ఉద్యోగులకు జీతాలు చెల్లించటం ఆర్టీసీకి కష్టం గా మారింది. దీంతో అందరికీ ఒకేసారి జీతాలు చెల్లించలేక ఉన్న డబ్బులతో జోన్లు, జిల్లాల వారీగా వేతనాలు విడుదల చేస్తున్నట్టు తెలిసింది. అలా 4వ తేదీ సాయంత్రం వరకు కొందరు డ్రైవ ర్లు, కండక్టర్లకు మాత్రమే జీతాలిచ్చిం ది. ఆర్టీసీలో అతి తకువ జీతాలుండే శ్రామిక్, మెకానిక్, భద్రతా సిబ్బందికి జీతాలు అందక వారి కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయి.