హైదరాబాద్, జనవరి 30(నమస్తే తెలంగాణ) : మేడారం భక్తులను ఆర్టీసీ నిలువుదోపిడీ చేసింది. జాతర కోసం ఏర్పాటు చేసిన 4వేల బస్సుల ద్వారా ఒక్కో ప్రయాణికుడి నుంచి 50శాతం అదనంగా చార్జీలు వసూలు చేసింది. 2024జాతరకు 17లక్షల మంది 3,491 బస్సుల ద్వారా ప్రయాణం చేయగా.. ఈ సారి 20 లక్షలకు పైగానే భక్తులు 4వేల బస్సుల ద్వారా ప్రయాణం చేసినట్టు ఉన్నతాధికారులు చెప్పారు. జీరో టిక్కెట్లు మినహా ఒక్కో టిక్కెట్‌పై 50శాతం అదనంగా వసూలు చేశారు. వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, ఖమ్మం, హైదరాబాద్ సిటీ నుంచి మొత్తం 51 ట్రాఫిక్ జనరేటింగ్ పాయింట్లతో ఈ ప్రత్యేక బస్సులు తిప్పినట్లు చెప్పారు. ఆర్టీసీలో కొన్ని ప్రత్యేక సందర్భాల్లో స్పెషల్ బస్సుల ద్వారా 50శాతం వరకూ అదనంగా టిక్కెట్ ధరలు పెంచుకునేందుకు 2003లో జారీ చేసిన జీవో 16ను ఆర్టీసీ ఉన్నతాధికారులు ఉటంకిస్తున్నారు