హైదరాబాద్, సెప్టెంబర్ 20 (నమస్తే తెలంగాణ): ‘రాష్ట్ర రైతాంగాన్ని పట్టి పీడిస్తున్న ఎల్ నినో కంటే తెలంగాణను అతలాకుతలం చేస్తున్న ఎల్ కాంగో (కాంగ్రెస్ పాలన) అత్యంత ప్రమాదకరం. ఎల్ నినో 10 ఏండ్లకోసారి వచ్చి ఆగం చేస్తది. కానీ ఎల్ కాంగో రోజూ ప్రజలను ముప్పుతిప్పలు పెడుతుంది. సంక్షేమాన్ని వదిలి ప్రజల బతుకులను చిన్నాభిన్నం చేస్తున్నది. ప్రజల భూములకు రక్షణ ఉండదు. మహిళల భద్రతకు భరోసా ఉండదు’ అని ప్రభుత్వంపై, కాంగ్రెస్ నేతల వ్యవహారంపై బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
హైదరాబాద్ తెలంగాణభవన్‌లో ఆదివారం బీఆర్ఎస్ నేతలు కల్వకుర్తి శ్రీనివాస్, సాయితేజ, రాజు, బాధిత రైతు నరేశ్‌తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజాసమస్యలను పరిష్కరించాల్సిన కాంగ్రెస్ ఎంపీలు కల్లుతాగిన కోతుల్లా వ్యవహరిస్తున్నారని, కాంగ్రెస్ పెద్దల దోపిడీ బండారం బట్టబయలు చేసిన బీఆర్ఎస్ నేతల ప్రైవేట్ ఆస్తులపై దాడులకు దిగుతున్నారని విమర్శించారు. ‘గతంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిని చంపేందుకు అరికెపూడి గాంధీ ఈ విధంగానే వారింటికి వెళ్లారు.
ఇటీవల హరీశ్‌రావు వ్యవసాయ భూమిలోకి వెళ్లిన కాంగ్రెస్ నేతలకు 3,000 మంది పోలీసులతో రక్షణ కల్పించారు’ అని ధ్వజమెత్తారు. ఎవరైనా అక్రమంగా ఆస్తులు సంపాదిస్తే ప్రభుత్వ సంస్థల ద్వారా విచారణ చేపట్టాల్సిన ప్రభుత్వ పెద్దలు, తెలంగాణను సాధించిన ఉద్యమకారుల ఇండ్లపై దాడులు చేయించడం సిగ్గుచేటని మండిపడ్డారు. ప్రభుత్వం నుంచి జీతాలు తీసుకుంటున్న ప్రజాప్రతినిధులు ప్రైవేట్ వ్యక్తుల ఇండ్లు, భూములపైకి వెళ్లడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.
‘పోలీస్ పహారాలో బీఆర్ఎస్ నేతల నివాసాలపై ఎంపీలు దాడులు చేస్తుంటే డీజీపీ ఏం చేస్తున్నారు? దాడులు చేస్తామని సోషల్ మీడియాలో ముందే ప్రకటించి వందలాది మందితో వెళ్తుంటే నిలువరించరా? అసలు రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ ఉన్నదా? నేను కూడా రేపు మీ ఇంటికో.. సీఎం రేవంత్‌రెడ్డి ఇంటికో రావచ్చా? ప్రజల ఇండ్లలోకి చొరబడితే ఊరుకుంటారా?’ అంటూ ప్రశ్నాస్త్రాలు సంధించారు. అసలు భూముల సర్వే చేయాల్సింది అధికారులా? అధికార పార్టీ ప్రజాప్రతినిధులా? అని నిలదీశారు. ఎనిమిది మంది చొప్పున కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు తెలంగాణకు చేసిందేమీలేదని, తెచ్చిందీ ఏమీలేదని తెలిపారు. కాంగ్రెస్ పాలనలో శాంతిభద్రతలు దిగజారాయని, రాష్ట్రం నేరాలు ఘోరాలకు అడ్డాగా మారిందని విమర్శించారు.
పాలన చేతగాకే డైవర్షన్ పాలిటిక్స్
కాంగ్రెస్ నేతలు పాలన చేతగాక, మూడేండ్ల వైఫల్యాలను కప్పిపుచ్చేందుకు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ఆరోపించారు. ‘ఎవరైనా అక్రమంగా ఆస్తులు సంపాదిస్తే.. సర్వే, రెవెన్యూ, పోలీస్, స్టాంప్స్-రిజర్వేషన్ శాఖల అధికారులతో విచారణ జరిపించవచ్చు కదా? కానీ ఇదేం డ్రామా? ఇందుకేనా ప్రజలు ఓట్లేసి ఎంపీలు, ఎమ్మెల్యేలుగా గెలిపించి అధికారమిచ్చింది? అధికారంలోకి వచ్చిన మూడేండ్ల తర్వాత ఎందుకు ఇలా చేస్తున్నారు? కలెక్టర్, సీసీఎల్ఏ, ఆర్డీవో, తహసీల్దార్ ద్వారా రివ్యూ చేయించలేరా? బుల్లెట్ ప్రూఫ్ వాహనాల్లో వచ్చి వాసోడిగామా లాగా ఏదో కొత్తది కనిపెట్టినట్టు లైవ్ మీడియా పెట్టి.. టెలికాస్ట్ చేయిస్తరు. ఇదేనా తెలంగాణ ప్రజలు కోరుకున్నది? అని ప్రశ్నలవర్షం కురిపించారు.
తాండూర్ ఎమ్మెల్యే 300 ఎకరాల భూ కబ్జా
తాండూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి తుమ్మలూరు గ్రామ పరిధిలో 300 ఎకరాల భూమిని కబ్జా చేశారని ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ఆరోపించారు. ఆ ప్రాంతానికి చెందిన బాధిత రైతులు యాదగిరి, నరేశ్ న్యాయం చేయాలని వేడుకుంటున్నా ఎవరూ పట్టించుకోకపోవడంతో తెలంగాణ భవన్‌కు వచ్చారని చెప్పారు. ‘తుమ్మలూరు మహేశ్వరంలో 371, 372, 373, 377 సర్వేనంబర్లలో వారికి 51 ఎకరాల భూమి ఉన్నది. వాళ్ల తాత గద్దగోటి ఎల్లయ్య పేరిట ఉన్న ఆ భూమిని తమ పేరిట పట్టా చేయాలని గత ఫిబ్రవరి 3న తహసీల్దార్‌ను కలిస్తే.. మార్చి 12న రిపోర్ట్ ఇచ్చారు. ఎల్లయ్య ఎవరికీ భూమిని అమ్మలేదు, అగ్రిమెంట్ చేయలేదు’ అని తెలిపారు.
ఆ రిపోర్ట్ ఆధారంగా కలెక్టర్‌ను కలిశారని, ఆయన సూచన మేరకు తిరిగి తహసీల్దార్ వద్దకెళ్తే ఆయన మార్చి 30న తాండూర్ ఎమ్మెల్యేకు అనుకూలంగా రిపోర్ట్ ఇచ్చారని తెలిపారు. ఇదే అదనుగా ఎమ్మెల్యే అనుచరులు ఆ భూమి చుట్టూ బ్లూషీట్స్ కట్టి, జేబీ, భవన్, కాంక్రీట్ ఇన్ఫ్రా కంపెనీల పేరిట బోర్డులు పెట్టి, అనిల్‌కుమార్‌రెడ్డి, ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, శివకుమార్‌రెడ్డి, అవినాష్కుమార్రెడ్డి కలిసి వెంచర్లు చేసి అమ్ముతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీల్లారా మీకు దమ్ముంటే, పేదలపై ప్రేమే ఉంటే మీ నాయకుడి భూమి వద్దకు వెళ్లాలని సవాల్ విసిరారు. ఈ వ్యవహారంలో బాధితులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని భరోసానిచ్చారు. త్వరలోనే తహసీల్దార్‌ను కలుస్తామని చెప్పారు.
పొంగులేటి రోజుకో బోర్డు!
నాదర్గుల్లోని 372 ఎకరాల్లో మంత్రి పొంగులేటి రోజుకొకటి చొప్పున బోర్డులు పెడుతున్నారు? చిత్తశుద్ధి ఉంటే అక్కడికి వెళ్లి ఆపండి అని ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ చెప్పారు. 22-ఏ బాధితులను కలిసి భరోసా ఇవ్వరా? అని ప్రశ్నించారు. ‘సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలం కొల్లూరులో ఎక్స్ సర్వీస్‌మెన్ భూమి.. అన్యాయంగా బొడ్డు వినోద్‌కుమార్ అనే పేరు మీదికి మారింది. ఈ విషయం తహసీల్దార్‌కు, ఆర్డీవోకు తెలియదని, 1645/1978 అనే లింక్ డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ సమయంలో పెట్టారని, అది కూడా ఇతరులదని వివరించారు. ఇలా ఫేక్ డాక్యుమెంట్లు పెట్టి అధికార అండతో భూదోపిడీ చేస్తున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో యథేచ్ఛగా భూ దందాలు సాగుతుంటే రెవెన్యూ మంత్రి మాత్రం 3 గంటలు అసెంబ్లీలో పచ్చి అబద్ధాలు చెప్పారని మండిపడ్డారు.
మల్లు రవీ.. నియోజకవర్గ సమస్యలు పట్టవా?
నాగర్‌కర్నూల్ ఎంపీ మల్లు రవి తన నియోజకవర్గ ప్రజల సమస్యలను గాలికొదిలి బీఆర్ఎస్ నాయకుల వ్యవసాయ భూముల చుట్టూ తిరగడం సిగ్గుచేటని ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ మండిపడ్డారు. ‘నీ నియోజకవర్గ పరిధిలోని గద్వాల జిల్లాలో కులాంతర వివాహం చేసుకొన్న వ్యక్తి ఇంటిని కూలగొడితే పట్టింపులేదా? చీమూ నెత్తురు ఉంటే బాధితులకు ఇందిరమ్మ ఇల్లు ప్రకటించాలి కదా?’ అని నిలదీశారు. ఆ దాడి గురించి బాధితులు చెప్పేదాకా పోలీసులకు తెలియదని దెప్పిపొడిచారు. ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ఆయన నియోజకవర్గ రైతులే జూరాల గేట్లు ఎత్తారు కదా? ఇది నీ వైఫల్యం కాదా? అని ప్రశ్నించారు. చామల కిరణ్‌కుమార్, మల్లు రవి చేయాల్సింది ఫామ్‌హౌస్‌ల చుట్టూ తిరగడం కాదని, తెలంగాణ సమస్యల గురించి పార్లమెంట్లో ప్రశ్నలు అడగాలని, దేశ సమస్యల మీద ప్రశ్నించాలని, ప్రతి బిల్లు చర్చలో పాల్గొనాలని హితవు పలికారు.
గెస్ట్‌హౌస్ ఎవరిది? సీఎం సన్నిహితుడెవరు?
అడ్వైర్టెజ్‌మెంట్ కోసం ముఖ్యమంత్రి సన్నిహితుడిని కలిస్తే తనను గెస్ట్‌హౌస్‌కు రమ్మన్నాడని ట్విట్టర్లో ఓ మహిళ పోస్ట్ చేసిన విషయాన్ని ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ప్రస్తావించారు. ఆ గెస్ట్‌హౌస్ ఎవరిది? ఆ సన్నిహితుడు ఎవరు? అది ఎకడ ఉన్నది? అన్న విషయాలను కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు కనిపెట్టి, ఆమె కన్నీళ్లు తుడువాలని సూచించారు. సాక్షాత్తు పోక్సో కేసులో కేంద్ర మంత్రి కొడుకును రేవంత్‌రెడ్డే కాపాడారని, ఇంకా రాష్ట్రంలో మహిళలకు ఎకడ రక్షణ ఉంటది? అని ఆవేదన వ్యక్తంచేశారు. కేంద్రమంత్రి బండి సంజయ్‌కి తెలంగాణలో రాజకీయం చేసే నైతిక అర్హత లేదని, ముందు ఆయన పేట్ బషీరాబాద్ పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోవాలని, సంగప్పను తీసుకెళ్లి విచారణకు సహకరించాలని డిమాండ్ చేశారు. కోతుల గుంపుల్లా కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ప్రైవేట్ వ్యక్తుల ఆస్తులపైకి వెళ్తే బీఆర్ఎస్ మాత్రం ప్రజల తరఫున పోరాడుతుందని స్పష్టంచేశారు.
యూనివర్సిటీ స్థలాలను విద్యార్థులకే కేటాయించాలి
యూనివర్సిటీ ప్రాంగణాల్లో విద్యార్థినులకు కనీస వసతులు కల్పించకుండా పోలీసు ఉన్నతాధికారుల కోసం స్థలాలను కేటాయించడంపై బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. విశ్వవిద్యాలయాల్లో విద్యార్థినుల హాస్టళ్లకు స్థలాభావం, పోలీసు ఉన్నతాధికారుల క్వార్టర్ల వ్యవహారంపై పత్రికల్లో వచ్చిన కథనాన్ని ఆదివారం ఎక్స్ వేదికగా పంచుకుంటూ ప్రభుత్వాన్ని సూటిగా నిలదీశారు. ‘సీఎం గారు.. మీరు బంగ్లాలు కట్టుకున్నట్టే పోలీసు ఉన్నతాధికారులకు కూడా ఎంసీఆర్హెచ్ఆర్డీలో బంగ్లాలు కట్టించండి.. తద్వారా యూనివర్సిటీలో చదువుకొనే విద్యార్థులకు కనీసం గజం జాగ అయినా దొరుకుతుందని, వారు క్షేమంగా, సురక్షితంగా చదువుకోగలుగుతారు’ అని పేర్కొన్నారు.
విశ్వవిద్యాలయాల్లో వేలాది మంది పేద, మధ్యతరగతి విద్యార్థినులు హాస్టల్ గదులు, సరైన వసతి లేక ఇబ్బందులు పడుతుంటే, ప్రభుత్వం మాత్రం కీలకమైన స్థలాలను పోలీసు ఉన్నతాధికారుల నివాసాలు, ఇతర అవసరాలకు కేటాయించడంపై విద్యార్థిలోకం అసంతృప్తి ఉన్నదంటూ ఆయన ఆగ్రహంవ్యక్తం చేశారు. పాలకులు సొంత విలాసాలు, ఉన్నతాధికారుల వసతులపై చూపిస్తున్న శ్రద్ధలో పదో వంతు కూడా విద్యాసంస్థలపై చూపడం లేదని ఆరోపించారు. యూనివర్సిటీ స్థలాలను పూర్తిగా విద్యార్థినుల హాస్టళ్లు, మౌలిక వసతుల కోసమే కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు.