కాగజ్‌నగర్, జూన్ 23: అటవీ చట్టాల పేరుతో రైతులను ఇబ్బందులకు గురి చేయవద్దని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ఫారెస్ట్ అధికారులుకు సూచించారు. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ మండలం అంకుసాపూర్ రైతు లు సాగు చేసుకుంటున్న భూములను దున్నేందుకు వెళ్లగా వారిని అటవీశాఖ అధికారులు అడ్డుకున్నారు. ఈ సమస్యపై ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ రైతులతో కలిసి కాగజ్‌నగర్ ఎఫ్‌డీవో సుశాంత్ ను సోమవారం కలిసి మాట్లాడారు.
అంకుసాపూర్లోని వారంతా నిరుపేద రైతులని, వారు తిండి కోసమే వానకాలంలోనే పంట వేసి బతుకుతారని ఎఫ్‌డీవో దృష్టికి తీసుకెళ్లారు. ఎఫ్‌డీవో సానుకూలంగా స్పందించి సమస్యను పరిషరించేందుకు ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం కాగజ్‌నగర్‌లోని సిర్పూర్ పేపర్ మిల్ ఈఎస్ఐ దవాఖాన, సిర్పూర్లోని ప్రభుత్వ దవాఖానను సందర్శించారు. ప్రభుత్వ దవాఖానలో కరెంట్ లేక రోగులు ఇబ్బంది పడుతుండటంపై అసహనం వ్యక్తం చేశారు.