హైదరాబాద్, ఆగస్టు 16 (నమస్తే తెలంగాణ): ‘ఒక మాజీ ఐపీఎస్ అధికారిగా, బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శిగా ఆధారాలతో కాళేశ్వరం కుట్రలపై పచ్చి నిజాలు చెప్పిన నాకు దళితనేత అనే ట్యాగ్ తగిలిస్తారా? కేసీఆర్ చేతిలో పావుగా మారానని అంటారా? ఏబీఎన్ రాధాకృష్ణా.. మీ వెంకటకృష్ణకు ఇంత కుల పిచ్చి ఉం డటం ఆశ్చర్యం కలిగిస్తున్నది’ అని ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆంధ్రజ్యోతి పేపర్, ఏబీఎన్ చానల్‌ను మరోసారి బహిష్కరిస్తున్నానని ఎక్స్ వేదికగా ప్రకటించారు. పద్మశ్రీ మందకృష్ణ, బీసీ ఉద్యమ నేత ఆర్ కృష్ణయ్యను బాడుగ నేతలని కించపరిచిన నాడే మీ పత్రికను నిషేధించాల్సిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘నేను కూడా మీ చానల్‌ను కమ్మ కులానికి చెందినదని అనవచ్చు. కానీ సంస్కారం అడ్డొస్తున్నది’ అని విమర్శించారు. మీలాగా బ్లాక్ మెయిల్ దందాలు చేసో, కులాన్ని వాడుకొనో తాను ఎదగలేదని స్పష్టంచేశారు. ఇంత అహంకార ధోరణి కలిగిన మిమ్మల్ని తెలుగు రాష్ట్రాల ప్రజలు, ప్రత్యేకించి బహుజనులు ఎలా భరిస్తున్నారోనని ఆశ్చర్యం వ్యక్తంచేశారు.