హైదరాబాద్, ఆగస్టు 16 (నమస్తేతెలంగాణ): ‘కాళేశ్వరం కుంగుబాటు వెనుక కుట్రకోణం దాగి ఉన్నది. అసెంబ్లీ ఎన్నికల ముందు కేసీఆర్‌ను బద్నాం చేసేందుకు అసాంఘిక శక్తులు మేడిగడ్డ పిల్లర్లను బాంబులతో పేల్చివేశాయి’ అని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ సంచలన ఆరోపణలు చేశారు. అసాంఘిక శక్తుల వెనుక కాంగ్రెస్, బీజేపీ ముఖ్య నేతల హస్తం ఉన్నదని ఆరోపించారు. మేడిగడ్డ బరాజ్ వద్ద 2023 అక్టోబర్ 21న భారీ శబ్దం వచ్చిందని, అది రెండు కిలోమీటర్ల దూరం వినిపించిందని ఇంజినీర్ రవికాంత్అనే ఇంజినీర్ మహదేవ్పూర్ ఠాణాలో ఫిర్యాదు చేశారని గుర్తుచేశారు. ‘174/2023 కింద కేసు నమోదు చేసిన పోలీసులు రెండేండ్లు అవుతున్నా దర్యాప్తు ఎందుకు చేయడంలేదు? లేదంటే, ఆధారాల్లేవని కేసు మూసివేయలేదెందుకు? ఫిర్యాదు అందిన వెంటనే డాగ్‌స్క్వాడ్, బాంబ్‌స్క్వాడ్, క్లూస్ టీఎంను తీసుకెళ్లి ఆధారాలు ఎందుకు సేకరించలేదు? పిల్లర్, ఇసుక శాంపుల్స్, సీస్పీక్ రిపోర్ట్ తీసుకొని సంబంధిత శాఖ ప్రయోగశాలకు పంపించలేదెందుకు? పిల్లర్ దెబ్బతిన్న వెంటనే నిరాధార ఆరోపణలు చేసిన రేవంత్‌రెడ్డి, బండి సంజయ్, కిషన్‌రెడ్డితో పాటు అక్కడ అనుమానాస్పదంగా సంచరించిన వ్యక్తుల డాటా సేకరించాల్సిన పోలీసులు ఎందుకు మిన్నకుండిపోయారు? అధికారంలోకి రాగానే విచారణ జరుపుతామని హడావుడి చేసిన రేవంత్‌రెడ్డి ఇప్పుడు సప్పుడుజేయడంలేదెందుకు?’అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.
చిత్తశుద్ధి ఉంటే వెంటనే సిట్ వేయాలని, సీబీఐతో విచారణ జరిపించి బాధ్యులెవరో తేల్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతలు సుమిత్రా ఆనంద్, ఇంతియాజ్ అహ్మద్, అభిలాష్రావుతో కలిసి విలేకరులతో మాట్లాడారు. బీఆర్ఎస్ను ఓడించేందుకే ఎన్నికల ముందు రేవంత్‌రెడ్డి, కిషన్‌రెడ్డి, బండి సంజయ్ పిల్లర్ కుంగుబాటు కుట్రకు తెరలేపారని ధ్వజమెత్తారు. ఇందులో భాగంగానే అప్పటి బీజేపీ అధ్యక్షుడు జీ కిషన్‌రెడ్డి ఆగమేఘాలపై ఎన్డీఎస్ఏకు లేఖ రాసి రప్పించారని ఆరోపించారు. రిపోర్టుల పేరిట లీకులు ఇస్తూ దుష్ప్రచారం చేశారని మండిపడ్డారు. ‘2023 జూన్‌లో ఉత్తరాఖండ్‌లోని తీస్తా నదిపై నిర్మించిన బరాజ్ వరదలకు కొట్టుకుపోయినా అక్కడి బీజేపీ నేతలు ఎందుకు లేఖ రాయలేదు? అక్కడికి ఎన్డీఎస్ఏ ఎందుకు వెళ్లలేదు. మొన్న పోలవరం కాఫర్ డ్యాం కొట్టుకుపోతే ఎందుకు స్పందించలేదు? బీజేపీ, కూటమి పాలిత రాష్ట్రాలపై మమకారమెందుకు? తెలంగాణపై కక్ష ఎందుకు?’ అని సూటిగా ప్రశ్నించారు. 2022లో రష్యా-ఉక్రెయిన్ యుద్ధ సమయంలో నిప్రో నదిపై నిర్మించిన ఖాకోవా డ్యాంను కంట్రోల్డ్ ఎక్స్‌ప్లోజివ్‌తో కూల్చివేసిన ఘటనలో 100 మంది మరణించారని గుర్తుచేశారు. ఇదే తరహాలో మేడిగడ్డ పిల్లర్‌ను సైతం కూల్చివేసినట్టు అనుమానం ఉన్నదని ఆరోపించారు.
29 లక్షల క్యూసెక్కుల వరదను తట్టుకోలేదా?
2019లో కేసీఆర్ నిపుణులతో రాత్రింబవళ్లు చర్చించి కాళేశ్వరం ప్రాజెక్టుకు అంకురార్పణ చేశారని ప్రవీణ్‌కుమార్ తెలిపారు. పక్కా ప్రణాళికతో 24 నెలల్లోనే నిర్మించి జాతికి అంకితమిచ్చారని గుర్తుచేశారు. 2019 నుంచి 2023 వరకు ఈ బృహత్తర ప్రాజెక్టు అద్భుత ఫలితాలిచ్చిందని పేర్కొన్నారు. లక్షల బీడు భూములను పచ్చటి మాగాణిగా తీర్చిదిద్దిందని చెప్పారు. 2022లో సుమారు 500 ఏళ్ల తర్వాత 29 లక్షల క్యూసెక్కుల వరదలు వస్తే తట్టుకొని నిలబడిన బరాజ్, కేవలం 20 లక్షల క్యూసెక్కుల ప్రవాహనికి దెబ్బతినడం నమ్మశక్యంగా అనుమానం వ్యక్తంచేశారు. అది కూడా ఏడో బ్లాక్‌లో ఒకే పిల్లర్ కుంగిపోవడం ఎలా సాధ్యం? బరాజ్ కుంగితే కూలిపోవాలి. కానీ ఒకే పిల్లర్‌కు పగుళ్లు రావడం ఏమిటి? ఈఫిల్ టవర్ కంటే ఏడురెట్ల ఐరన్, బుర్జ్ఖలీపా కంటే ఏడురెట్ల సిమెంట్ వాడిన ప్రాజెక్టు కుంగిపోవడంపై ఇంజినీరింగ్ నిపుణులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. కోటి ఎకరాలకు సాగునీరు, హైదరాబాద్‌కు తాగునీరందించే మహత్తర పథకాన్ని ఎన్నికల్లో గెలిచేందుకు కాంగ్రెస్, బీజేపీ నేతలు అరాచక శక్తులతో చేతులు కలిపి కూల్చి వేయించారని ఆరోపించారు.
అనుమతులపైనే ఘోష్ కమిషన్ విచారణ
కాళేశ్వరంపై కాంగ్రెస్ సర్కారు నియమించిన పీసీ ఘోష్ కమిషన్ సైతం మేడిగడ్డ పిల్లర్ కుంగుబాటుకు కారణాలపై దృష్టిపెట్టకపోవడం దురదృష్టకరమని ప్రవీణ్‌కుమార్ అన్నారు. కేవలం ప్రాజెక్టు ప్రణాళిక ఎవరు రూపొందించారు? క్యాబినెట్ అనుమతులు తీసుకున్నారా? అప్పటి మంత్రులు చాయ్ బిస్కెట్లు తీసుకున్నారా? కాఫీ తాగారా? నీళ్లు తాగారా? లాంటి విషయాలకే పరిమితం కావడం శోచనీయనీయని ఆవేదన వ్యక్తంచేశారు. కుంగడానికి కారణాలను అన్వేషించకపోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. వాస్తవానికి పిల్లర్ ఘటనపై అప్పటి ఇంజినీర్ల నుంచి స్టేట్మెంట్ తీసుకొని రికార్డు చేస్తే బాగుండేదని అభిప్రాయపడ్డారు. ఎన్డీఎస్ఏ సైతం ఉదాసీనంగా వ్యవహరించిందని ఆరోపించారు.
పోలవరానికి ఓ నీతి.. కాళేశ్వరానికి మరో నీతా?
కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోని సీడబ్ల్యూసీ నేతృత్వంలో నిర్మిస్తున్న పోలవరం మూడుసార్లు కొట్టుకుపోయినా ఎన్డీఎస్ఏ ఎందుకు పట్టించుకోలేదని ప్రవీణ్‌కుమార్ నిలదీశారు. మొన్న కాఫర్ డ్యాం వరదల్లో కొట్టుకుపోయినా ఎందుకు మిన్నకున్నారని ప్రశ్నించారు? ఏపీలో తమ భాగస్వామి సర్కారు ఉన్నందుకే వదిలేస్తున్నారా? అని ప్రశ్నించారు. కాళేశ్వరంలో ఒక్క పిల్లర్ కుంగితే నానాయాగీ చేసిన నాయకులు ఇప్పుడు ఏం సమాధానం చెప్తారని ప్రవీణ్‌కుమార్ నిలదీశారు.
రేవంత్‌రెడ్డి ఏపీ సీఎం ఏజెంట్
దెబ్బతిన్న మేడిగడ్డ పిల్లర్‌ను రిపేర్ చేయించి, మోటార్లు ఆన్‌చేసి మన రైతుల పొలాలకు నీరందించాల్సిన సీఎం రేవంత్‌రెడ్డి నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని ప్రవీణ్‌కుమార్ నిప్పులు చెరిగారు. ఏపీ సీఎం చంద్రబాబుకు ఏజెంట్‌గా మారి తెలంగాణకు తీరని అన్యాయం చేస్తున్నారని దుయ్యబట్టారు. గోదావరి జలాలను కొల్లగొట్టేందుకు నిర్మిస్తున్న బనకచర్లకు హారతులు పడుతున్నారని విమర్శించారు. ఆంధ్రా పెట్టుబడిదారుల చేతుల్లో కీలుబొమ్మలా మారారని విమర్శించారు. 20 మంది ఆంధ్రా కాంట్రాక్టర్లే తెలంగాణ పాలనను నడిపిస్తున్నారని స్వయంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి చెప్పిన విషయాన్ని ప్రస్తావించారు. ఇప్పటికైనా కాళేశ్వరంపై కుట్రలు కట్టిపెట్టి మరమ్మతులు చేయించాలని డిమాండ్ చేశారు. లేదంటే తెలంగాణ సమాజం క్షమించబోదని తీవ్రస్థాయిలో హెచ్చరించారు.
అబద్ధాల్లో ఫస్ట్.. అభివృద్ధిలో లాస్ట్
తెలంగాణ అభివృద్ధి, ప్రజా సంక్షేమం పట్టని రేవంత్‌రెడ్డి డైవర్షన్ డ్రామాల్లో ఆరితేరారని ప్రవీణ్‌కుమార్ ధ్వజమెత్తారు. అందరూ వివిధ సబ్జెక్టుల్లో పీహెచ్‌డీలు చేస్తే ఆయన అబద్ధాలు చెప్పడంలో పూర్తి చేశారని ఎద్దేవా చేశారు. నాడు ఓట్ల కోసం కేసీఆర్ నిర్మించిన ప్రగతిభవన్‌లో అద్దాల బాత్రూంలు ఉన్నాయని అబద్ధాలు చెప్పారని, ఇప్పుడు అదే భవనంలో ఉంటున్న డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్కను అడిగితే నవ్వుతున్నారని ఎద్దేవా చేశారు. కాళేశ్వరం విషయంలోనూ తప్పుడు ప్రచారం చేసి ప్రజలను తప్పుదోవ పట్టించారని మండిపడ్డారు. స్వాతంత్య్ర వేడుకల్లోనూ అప్పులపై తప్పుడు కూతలు కూశారని దుయ్యబట్టారు.
కేసీఆర్ పదేండ్ల పాలనలో రూ. 3.8 లక్షల కోట్ల అప్పులు చేశారని కేంద్రం పార్లమెంట్ సాక్షిగా వెల్లడించిన విషయాన్ని విస్మరించి రూ. 8.21లక్షల కోట్లు అప్పులు తెచ్చారని తప్పులు చెప్పడం సిగ్గుచేటని తూర్పారబట్టారు. 20 నెలల్లో 2.5 లక్షల కోట్ల అప్పులు తెచ్చి రికార్డు సృష్టించారని నిప్పులు చెరిగారు. నీళ్లు, నిధులు, నియామకాల నినాదాన్ని ఎత్తుకొని ఉద్యమించి స్వరాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ పదేండ్ల పాలనలో తెలంగాణను దేశానికే ఆదర్శంగా నిలిపారని గుర్తుచేశారు. రేవంత్ మాత్రం మిడిమిడి జ్ఞానం, సమస్యలు, అభివృద్ధిపై అవగాహనలేమితో రాష్ర్టాన్ని అధోగతి పాల్జేస్తున్నారని ప్రవీణ్‌కుమార్ విరుచుకుపడ్డారు.