కరీంనగర్ : రూ. 51 కోట్లతో కరీంనగర్ సమీకృత కలెక్టరేట్ నిర్మాణానికి బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పరిపాలన సౌలభ్యం కోసం సీఎం కేసీఆర్ 33 జిల్లాలో సమీకృత పరిపాలన భవనాలు నిర్మాణం చేపట్టారన్నారు. దీంతో అధికారులు అందుబాటులో ఉండి అన్ని కార్యాలయాలు ఒకే చోట ఉంటాయని స్పష్టం చేశారు.
ఇప్పుడు ఉన్న భవనం లీకేజీలు అవుతుందని, కొన్ని కార్యాలయాలు ఇతర చోట్లకు షిఫ్ట్ అయ్యాయని పేర్కొన్నారు. ఒక్కో కార్యాలయానికి ప్రజలు వెళ్లాలంటే ఇబ్బందులు పడుతున్నారని, ప్రజల సౌలభ్యం కోసం అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఒకేచోట నిర్మిస్తున్నామని మంత్రి తెలిపారు.
జీ ప్లస్ 2 గా నిర్మిస్తున్న ఈ భవన సముదాయం పనులు ఏడాదిలోగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామన్నారు.
నెలకొసారి పనుల ప్రగతిపై సమీక్ష చేస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, ఎమ్మెల్సీలు భాను ప్రసాద్ రావు, కౌషిక్ రెడ్డి, జడ్పీ అధ్యక్షురాలు విజయ, మేయర్ వై సునిల్ రావు, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ రావు తదితరులు పాల్గొన్నారు.