జగిత్యాల, ఏప్రిల్ 11: సీపీఎస్‌కు సంబంధించిన డబ్బులు జమ చేసేందుకు లంచం తీసుకుంటూ జగిత్యాల ట్రెజరీ కార్యాలయ సీనియర్ అకౌంటెంట్ శుక్రవారం ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి తెలిపిన వివరాల ప్రకారం.. కోరుట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న పవన్‌కుమార్ సీపీఎస్‌కు సంబంధించిన డబ్బులు తన ఖాతాలో జమ చేయాలని జిల్లా ట్రెజరీ కార్యాలయంలో సీనియర్ అకౌంటెంట్ అరిగే రఘుకుమార్‌ను ఫిబ్రవరి 25న కలిసి కోరాడు. ఆయన రూ.7 వేలు లంచం డిమాండ్ చేయగా కానిస్టేబుల్ అంగీకరించాడు. దీంతో సీపీఎస్ డబ్బులు రూ.1.04 లక్షలు పవన్‌కుమార్ ఖాతాలో జమయ్యాయి. తర్వాత ఒప్పందం ప్రకారం లంచం డబ్బులు ఇవ్వాలని రఘుకుమార్ కానిస్టేబుల్‌కు ఫోన్ చేశాడు. అయితే, ఉద్యోగంలో ఒత్తిడితో లంచం ఇవ్వలేకపోయాడు. శుక్రవారం పవన్‌కుమార్ నుంచి రఘుకుమార్ రూ.7 వేలు లంచం తీసుకుంటుండగా, ఏసీబీ అధికారులు రఘును అదుపులోకి తీసుకున్నారు.
టెట్ నోటిఫికేషన్ విడుదల ; ఈ నెల15 నుంచి 30 వరకు దరఖాస్తుల స్వీకరణ
హైదరాబాద్, ఏప్రిల్ 11 (నమస్తే తెలంగాణ) : టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(టె ట్) షెడ్యూల్ విడుదలైంది. ఈ నెల 15 నుంచి 30 వరకు ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరించనున్నారు. పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఈవీ నర్సింహారెడ్డి టెట్ నోటిఫికేషన్‌ను శుక్రవారం విడుదల చేశారు. నోటిఫికేషన్, ఇన్ఫర్మేషన్ బులిటిన్‌ను ఈ నెల 15న విడుదల చేస్తారు. హాల్‌టికెట్లను జూన్ 9న విడుదల చేయనుండగా, జూన్ 15 నుంచి 30 వరకు పరీక్షలను ఆన్లైన్లో నిర్వహిస్తారు. జూలై 22న ఫలితాలు ప్రకటిస్తారు. వివరాల కోసం అభ్యర్థులు https ://schooledu.telangana. gov.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలి. డీఎస్సీపై ప్రభుత్వం త్వరగా నిర్ణయం తీసుకోవాలని డీఎడ్, బీఎడ్ అభ్యర్థుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రావుల రామ్మోహన్‌రెడ్డి డిమాండ్ చేశారు. 10 వేల పోస్టులతో డీఎస్సీని జారీచేయాలని కోరారు.