‘మూట ముట్టకురా మూర్ఖా’.. ఇంద్ర సినిమాలో దొంగ స్వామి వేషంలో బ్రహ్మానందం చెప్పే ఈ డైలాగ్ తెలియనివారుండరు. ఇక్కడ ‘మూట ముట్టకుండానే మాయమైంది’ అని జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఎన్నికల బాధ్యతను నెత్తిన వేసుకొని తిరుగుతున్న మంత్రులు కలవరపడుతున్నారట! ‘మా చేతికి రూపాయి రాలేదు. ఈ బరువు ఎవడు మోయాలె?’ అని ఇప్పుడు అలకబూనారట!
హైదరాబాద్, అక్టోబర్ 28 (నమస్తే తెలంగాణ): జూబ్లీహిల్స్ టికెట్ కోసం కూడబెట్టిన రూ.300 కోట్ల వనరులు నడిమిట్లనే మాయమయ్యాయని ఇన్చార్జి మంత్రులు కంగారు పడుతున్నట్టు కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నది. పార్టీఫండ్, ఎన్నికల ఖర్చుల కింద తీసుకున్న రూ.300 కోట్లు ఇప్పటికీ జూబ్లీహిల్స్‌కు చేరకపోవడంపై మంత్రుల్లో గందరగోళం నెలకొన్నట్టు తెలుస్తున్నది. ‘ఖర్చులకు ఒక్క పైసా ఇవ్వకుంటే కార్యకర్తలకు, ఓటర్లకు ఏమి పెట్టి మెప్పించాలె’ అని మంత్రులు గుర్రుగా ఉన్నారని పార్టీ కార్యకర్తలే చెవులు కొరుక్కుంటున్నారు. ‘కోడ్’ కూయక ముందు నుంచే నియోజకవర్గంలో తిష్ట వేసి హడావుడి చేసిన మంత్రులు, తీరా ఎన్నికలు నెత్తి మీదికి వచ్చిన వేళ ముఖం చాటేసి నియోజకవర్గం బయట తిరగడంపై టీపీసీసీకి ఆరా తీయగా అసలు విషయం బయటికి పొక్కినట్టు పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తున్నది. నియోజకవర్గంలో పార్టీ కార్యకర్తల చాయ్, నీళ్ల ఖర్చులకు కూడా అటు అభ్యర్థి నుంచి గాని, ఇటు పార్టీ నుంచి గాని మంత్రులకు రూపాయి కూడా అందలేదని టీపీసీసీ గుర్తించినట్టు తెలిసింది. వనరులు వచ్చినా తమకు రూపాయి ఇవ్వకుంటే ఎన్నికల భారం ఎవరు మోయాలని మంత్రులు అలకబూని తప్పించుకు తిరుగుతున్నట్టు ప్రచారం జరుగుతున్నది.
అసలేం జరిగింది?
జూబ్లీహిల్స్ ఎప ఎన్నిక కోసం నలుగురు ఔత్సాహిక అభ్యర్థులను ఎంపిక చేసిన ఆ పార్టీ, వీలైనంత ఎక్కువ పార్టీ ఫండ్, ఎన్నికల ఖర్చులు పెట్టుకోగలిగే నేతకు టికెట్ ఖరారు చేస్తామని అంతర్గత వేలం పాట పెట్టినట్టు తెలిసింది. ఈ వేలం పాటలో నలుగురు అభ్యర్థులు నాలుగు ఫిగర్లు చెప్పినట్టు ప్రచారం జరుగుతున్నది. వీరిలో అత్యంత ఎక్కువగా ఇప్పుడున్న ఔత్సాహిక యువకుడి తరఫున వ్యక్తి తమకు టికెట్ ఇస్తే పార్టీ ఫండ్ రూ.100 కోట్లు, ఎన్నికల ఖర్చుకు రూ. 200 కోట్లు మొత్తం కలిపి రూ.300 కోట్ల రాశి పోస్తానని ఒప్పుకున్నట్టు తెలిసింది. అందులో కొంత మేరకు నగదు మూటలు సమకూర్చినట్టు సమాచారం. మిగిలిన మొత్తం సొమ్ము సమకూరక పోవడంతో తమకు ఉన్న కొన్ని ఆస్తులను తనఖా పెట్టి సమకూర్చినట్టు తెలిసింది. అంతా కలిపి రూ.300 కోట్లు సమకూరినట్టు మంత్రులే బహిరంగంగా చెప్తున్నారు. ఇందులోంచి ఎన్నికల ఖర్చుల కింద రూ.200 కోట్లు ఇన్చార్జి మంత్రులకు అప్పగించాలని అప్పుడే ఒప్పందం కుదిరినట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి.
మంత్రుల అలక.. నియోజకవర్గానికి దూరం
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు ముగ్గరు మంత్రులను తొలుత ఇన్చార్జిలుగా నియమించిన విషయం తెలిసిందే. ఎలక్షన్ కోడ్ రావడం కంటే ముందే వాళ్లు నియోజకవర్గంలో తిష్ట వేశారు. ప్రెస్మీట్లు, పర్యటనలు అంటూ ముగ్గురు మంత్రులు ఒకరిని మించి ఒకరు హడావుడి చేశారు. ఈ నేపథ్యంలో మంత్రుల మధ్య విభేదాలు, సహచర మంత్రిపై బాడీ షేమింగ్ వ్యాఖ్యలు, అనంతరం కుల పంచాయితీలు జరిగిన విషయం తెలిసిందే. అయినా రూ.200 కోట్ల వనరులను ఖర్చు చేయాల్సిన బాధ్యత తమ మీదనే ఉంటుందనే ఆలోచనతో మంత్రులు సర్ధుకుపోయి, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల మీద దృష్టి పెట్టారని పార్టీ నేతలు చెప్తున్నారు. పోలింగ్ సమయం దగ్గరపడ్డదని, పోటీ అభ్యర్థి ప్రచారంలో దూసుకపోతున్నా పార్టీ అభ్యర్థి నుంచి గాని, పార్టీ నేత నుంచి గాని ఇప్పటి వరకు రూపాయి రాకపోవడంతో మంత్రులు ఆందోళనతో ఉన్నట్టు తెలిసింది. వనరులు అప్పుడొస్తయి.. ఇప్పుడొస్తయని కండ్లు కాయలు కాసేలా ఎదురు చూసినా ఇప్పటి వరకు మంత్రుల చేతికి రూపాయి కూడా అందనట్టు తెలిసింది. మరోవైపు పార్టీ లీడర్ల నుంచి, క్యాడర్ నుంచి ఒత్తిడి పెరుగుతుండటంతో మంత్రులు తప్పించుకొని తిరుగుతున్నారని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ నడుస్తున్నది.
వనరులు ఎటు వెళ్లినట్టు?
‘బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఖర్చు చేస్తున్న ప్రతి రూపాయి తెలంగాణ నుంచి వచ్చింది’ అని జన్ సురాజ్ పార్టీ అధ్యక్షుడు, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ అప్పట్లో ఆరోపించారు. వాస్తవానికి తెలంగాణ నుంచి రూ.800 కోట్లు, కర్ణాటక నుంచి రూ.250 కోట్ల చొప్పున అందాలని అప్పట్లోనే దిశానిర్దేశం చేసినట్టు తెలిసింది. తెలంగాణ నుంచి అనుకున్నది అనుకున్నట్టుగానే రెండు దఫాలుగా పంపినట్టు ఢిల్లీ నేతలు మాట్లాడుకుంటున్నారు. మొదటి విడతలో ప్రత్యేక విమానం ద్వారా కేరళకు నిధులు చేర్చినట్టు సమాచారం. రెండో విడతలో రాష్ట్రంలో నంబర్ 2 నేత 10 రోజుల కిందట ఆకస్మికంగా ఢిల్లీ పర్యటనకు వెళ్లి వచ్చారని, అక్కడే వ్యవహారం సెట్ చేశారని సమాచారం. అయితే జూబ్లీహిల్స్ వ్యక్తి నుంచి వచ్చిన రూ.300 కోట్లను కూడా బీహార్‌కు తరలించారని మంత్రులే అనుమానిస్తున్నారు. ఇచ్చిన, వచ్చిన వనరులను అటు పంపి.. బీహార్ కోసం సేకరించిన నిధులను ‘మలుపుకొంటున్నట్టు’ మంత్రులు అనుమానిస్తున్నారు. మరో వైపు ఎన్నికల కోసం ఇవ్వాల్సిన డబ్బు అప్పుడే ఇచ్చేశామని, ఇక రూపాయి కూడా ఖర్చు పెట్టేది లేదని, ఒక్కడ ఓడి పోతే తాము ఓడినట్టు కాదని, కాంగ్రెస్ ఓడిపోయినట్టు అని పోటీదారు కుటుంబ సభ్యులు తెగేసి చెప్పినట్టు విశ్వసనీయంగా తెలిసింది.