Aarogyasri | హైదరాబాద్, మార్చి 20 (నమస్తే తెలంగాణ): ఇక ‘ఆరోగ్యశ్రీ’ కనుమరుగు కానున్నదా? ఈ పథకం ద్వారా పేదలకు అందాల్సిన కార్పొరేట్ వైద్య సేవలు నిలిచిపోనున్నాయా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తున్నది. ఇందుకు కారణం రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ప్రవేశపెట్టిన 2025-2026 బడ్జెట్లో తక్కువ నిధులు కేటాయించడమే.
ఆరోగ్యశ్రీ సేవల కోసం నెట్వర్క్ దవాఖానలకు ఇప్పటికే రూ.1200 కోట్ల బకాయిలు పెండింగ్ ఉండగా, కాంగ్రెస్ ప్రభుత్వం తాజా బడ్జెట్లో కేవలం రూ.1143 కోట్లు మాత్రమే కేటాయించింది. ఈ నిధులతో బకాయిలు చెల్లించలేని పరిస్థితి నెలకొన్నది. దీంతో నెట్వర్క్ దవాఖానల యాజమాన్యాలు ఆందోళనలో ఉన్నాయి. ఇప్పటికే బకాయిలు చెల్లించకపోవడంతో ఈ ఏడాది జనవరి నుంచి సేవలు నిలిపివేశాయి. ఈహెచ్ఎస్, జేహెచ్ఎస్ స్కీమ్‌లకు సైతం వైద్య సేవలను ఆపేశాయి. బడ్జెట్ నేపథ్యంలో పెండింగ్ బిల్లులకు నిధులు కేటాయిస్తారనుకున్న వారి ఆశలపై ప్రభుత్వం నీళ్లు చల్లడంతో చిన్న దవాఖానల నిర్వహణ భారంగా మారింది.