Ranga Reddy | హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, సెప్టెంబర్ 8 (నమస్తే తెలంగాణ)/మహేశ్వరం: శ్రీశైలం జాతీయ రహదారి పక్కనే ఉన్న రియల్ వెంచర్ ఒకటి కాదు… రెండు చెరువుల గొంతు నులిమింది. శంషాబాద్ విమానాశ్రయం మొదలు పహాడీషరీఫ్ వంటి ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున వచ్చే వరదను ఒడిసిపట్టే కొత్తకుంట నోట్లో సైతం మట్టి కొట్టి వెంచర్లో కలుపుకొన్నారు. సామాన్య రైతు మొదలు అన్ని శాఖల అధికారులకు ఈ కబ్జాపర్వం తెలిసినప్పటికీ ఎవరికి వారు ఫిర్యాదులు వచ్చాయి, కేసులు నమోదు చేశాం అంటున్నారేగానీ కొత్తకుంటను మాత్రం కబ్జా చెర నుంచి విడిపించలేదు. మరి, చెరువులను పరిరక్షిస్తామంటూ కబ్జాలపర్వాన్ని కొనసాగిస్తున్న హైడ్రావర్టెక్స్ గిగా సిటీతో నలిగిపోయిన కొత్తకుంటతో పాటు సూరం చెరువుకు విముక్తి కల్పిస్తారా? లేదా? అని మహేశ్వరం రైతాంగం ఎదురుచూస్తున్నది. అందుకే ‘హైడ్రా.. ఇటు చూడు!’ అంటూ ఆహ్వానిస్తున్నది. ఈ రియల్ వెంచర్ వర్టెక్స్-కేఎల్ఆర్ గిగా సిటీగా రూపుదిద్దుకోగా, చెరువుల కబ్జాకు సంబంధించిన వెంచర్ విస్తరణతో తనకు సంబంధంలేదని మహేశ్వరం కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి చెబుతుండడం గమనార్హం.
గొలుసుకట్టు చెరువుకు శాపంగా రియల్ వెంచర్
రంగారెడ్డి జిల్లాలోని మంఖాల్ గ్రామ పరిధిలోని గొలుసుకట్టు చెరువులకు రియల్ వెంచర్ ఒక శాపంలా తయారైంది. శ్రీశైలం జాతీయ రహదారిని అనుసరించి ఉన్న ఈ వెంచర్ ఏకంగా రెండు నీటి వనరులను కబ్జా చేసినా పట్టించుకునే దిక్కు లేదు. ఎగువ ప్రాంతం నుంచి వచ్చే వరద వివిధ మార్గాల్లో కొత్తకుంటకు చేరుతుంది. మంఖాల్ రెవెన్యూ పరిధిలోని సర్వే నంబరు 776లో దాదాపు పదెకరాల వరకు విస్తరించి ఉన్న ఈ కుంటకు వరద వచ్చేందుకు ఐదారు మార్గాలున్నట్టు అక్కడి రైతులు చెబుతున్నారు. ఈ కుంట మత్తడి దుంకడంతో వరద దిగువన ఉన్న సూరం చెరువుకు చేరుకుంటుంది. సూరం చెరువు 60.32 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. అయితే ఈ వెంచర్లో సూరం చెరువును సగం వరకు కబ్జా చేసినట్టుగా ఇప్పటికే ‘నమస్తే తెలంగాణ’ కథనాన్ని ప్రచురించింది. ఇది చదివి అక్కడి రైతాంగం స్పందించింది. సూరం చెరువు మాత్రమే కాదు… దాని ఎగువన ఉన్న కొత్త కుంటను సైతం వందలకొద్దీ టిప్పర్ల మట్టితో పూడ్చివేసి, వెంచర్లో కలుపుకున్నట్టు ‘నమస్తే తెలంగాణ’కు వివరాలు అందించారు.
ప్రశ్నార్థకంగా ఆ ప్రాంత భవితవ్యం
దశాబ్దాలుగా హైదరాబాద్ మహా నగరంలోని చెరువులు కబ్జాకు గురవడంతో చిన్నపాటి వర్షానికే రోడ్లు గోదారులై, కాలనీలు జలదిగ్బంధనంలోకి వెళ్తున్న దృశ్యాలు చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో కనీసం నిర్మాణాలు అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లోనైనా నీటి వనరులను కాపాడుకోవడంలో అధికార యంత్రాంగం తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నది. మంఖాల్ గ్రామ పరిధిలోని రియల్ వెంచర్ ఆక్రమించిన రెండు నీటి వనరులకు పెద్ద ఎత్తున ఎగువ నుంచి వరద వస్తుంది. రెండింటినీ ఆక్రమించి వెంచర్లో కలుపుకొని భవిష్యత్తులో అక్కడ నిర్మాణాలు వస్తే, వచ్చే వరద ఎటు పోతుందనేది ఆందోళన కలిగించే అంశం. హెచ్ఎండీఏ మాస్టర్‌ప్లాన్‌లో స్పష్టంగా ఉన్న కొత్తకుంట పదెకరాల్లో ఉంటుందని రైతులు, మున్సిపల్ శాఖ చెబుతుండగా, ఎనిమిది ఎకరాల వరకు ఉంటుందని నీటిపారుదలశాఖ ఇంజినీర్లు చెబుతున్నారు. ఎంత విస్తీర్ణంలో ఉన్నప్పటికీ కుంట మొత్తాన్ని భారీఎత్తున మట్టితో పూడ్చివేశారు.
కుంటకు వరద వచ్చే అన్ని మార్గాలను మూసి కేవలం ఒక మార్గంలో కాంక్రీట్‌తో డ్రెయిన్ బాక్సులు నిర్మించారు. దాని నుంచి దిగువన ఉన్న సూరం చెరువుకు వచ్చే వరద మార్గంలో సైతం డ్రెయిన్ బాక్సులు నిర్మించారు. అంటే ఎగువ నుంచి ఎంత వరద వచ్చినా కొత్తకుంటలోకి రాకుండా నేరుగా డ్రెయిన్ బాక్సుల ద్వారా దిగువన కబ్జా పోను మిగిలిన సూరం చెరువులోకి వెళుతుందన్నమాట. సూరం చెరువు కబ్జాపై ‘నమస్తే తెలంగాణ’లో కథనం రావడంతో అప్రమత్తమైన సదరు రియల్టర్ కొత్తకుంట గుట్టు కూడా రట్టువుతుందని ముందే ఊహించినట్టుంది. అందుకే కథనం వచ్చిన రోజే రెండు జేసీబీలతో ఎగువ నుంచి వచ్చే వరద డ్రెయిన్ బాక్సులోకి వెళ్లకుండా నేరుగా చెరువులోకి వెళ్లేలా కాల్వ తవ్వించినట్టు రైతులు తెలిపారు. దీంతో గత కొన్నిరోజులుగా కురుస్తున్న వర్షాలతో ఎగువ నుంచి వచ్చే వరద ఆ కాల్వ ద్వారా కొత్తకుంటలోకి చేరుకుంటున్నది.
హైడ్రా వచ్చేనా? మోక్షం కల్పించేనా?
కొత్తకుంట కబ్జాపై గతంలోనే ఫిర్యాదు చేశామని రైతులు, మహేశ్వరం కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి చెబుతున్నారు. తాము కూడా ఫిర్యాదు చేసి, కేసు నమోదు చేయించామని తుక్కుగూడ మున్సిపల్ కమిషనర్ వెంకట్రాం తెలిపారు. తాము గతంలోనే కుంటను పరిశీలించి, కేసు నమోదు చేశామని నీటిపారుదలశాఖ ఇంజినీర్లు సైతం సెలవిస్తున్నారు. మరి, అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్టు అందరూ ఫిర్యాదు చేసి, కేసులు నమోదు చేసినా కొత్తకుంట, సూరం చెరువుకు మోక్షం ఎందుకు కలగడంలేదో అనేది ఎవరికీ అంతుబట్టని విషయం. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగ నిర్లక్ష్యాన్ని చూస్తుంటే మరికొన్ని రోజులైతే ఎప్పటిలాగే కొత్తకుంటలోని నీరు దిగువకు మళ్లించి మళ్లీ మట్టితో చదును చేస్తారని స్థానిక రైతులు వాపోతున్నారు. అందుకే ఈ కబ్జాను మొగ్గ దశలోనే తుంచేవేసేందుకు హైడ్రా రంగంలోకి దిగుతుందా? లేదా? అని స్థానికంగా చర్చ జరుగుతున్నది. ప్రస్తుతం వెంచర్ రియల్టర్ చేతిలోనే ఉండటంతో హైడ్రా ఇప్పుడు రంగంలోకి దిగితే వెంచర్లో ప్లాట్లు కొనుగోలు చేసి సామాన్యుడు బలి కాకుండా ఉంటాడని అంటున్నారు.