హైదరాబాద్, జనవరి 1 (నమస్తే తెలంగాణ): కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ, తుమ్మిడిహట్టి వద్ద ప్రాణహిత నదిపై బరాజ్ నిర్మాణం అంశాలపై మంగళవారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నారు. జాగో తెలంగాణ, తెలంగాణ జలసాధన సమితి సంయుక్తంగా సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నాయి. ఈ విషయాన్ని తెలంగాణ జలసాధన సమితి సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. సమావేశానికి హైకోర్టు మాజీ న్యాయమూర్తి, జాగో తెలంగాణ చైర్మన్ జస్టిస్ చంద్రకుమార్, విశ్రాంత ఐఏఎస్, జాగో తెలంగాణ కన్వీనర్ ఆకునూరి మురళితోపాటు ప్రముఖ ఇంజినీర్లు, సామాజిక, రాజకీయ ప్రముఖులు పాల్గొననున్నారని వెల్లడించారు.