ఇల్లెందు, డిసెంబర్ 8: రోళ్లపాడు ప్రాజెక్టును పునఃప్రారంభించాలని సేవాలాల్ సేన భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు మాలోత్ శివనాయక్ డిమాండ్ చేశారు. తలాపునే సీతారామ ప్రాజెక్టు ఉన్నా నీళ్లను మాత్రం పొరుగు జిల్లాకు ఎలా తీసుకెళ్తారని ప్రశ్నించారు. సీతారామ నుంచి మొదటగా ఏజెన్సీ ప్రాంతాలకే సాగునీరు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇల్లెందు, భద్రాచలం ఏజెన్సీలకు సీతారామ ప్రాజెక్టు నీళ్ల సాధన కోసం సేవాలాల్ సేన చేపట్టిన పాదయాత్ర రెండో రోజుకు చేరుకున్నది. ఆదివారం టేకులపల్లిలో ఏర్పాటుచేసిన సమావేశంలో శివనాయక్ మాట్లాడుతూ.. సీతారామ ప్రాజెక్టు ద్వారా తొలుత ఏజెన్సీ ప్రాంతాలకు సాగునీరు అందించకుండా మైదాన ప్రాంతాలకు తరలించేందుకు ప్రభుత్వ పెద్దలు కుట్రలు పన్నుతున్నారని మండిపడ్డారు. ముందుగా భద్రాద్రి జిల్లాకు నీళ్లు ఇచ్చాకే ఖమ్మం జిల్లాకు తీసుకెళ్లాలని డిమాండ్ చేశారు.