మహబూబ్నగర్, మార్చి 7 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదాన్ని పసిగట్టేందుకు మరో నిపుణుల బృందాన్ని శుక్రవారం ప్రభుత్వం రంగంలోకి దింపింది. నలుగురు సభ్యులతో కూడిన అన్వి రోబోటిక్ బృందం టన్నెల్లోకి వెళ్లి పరిస్థితిని సమీక్షించింది. నిపుణులతోపాటు ఐఐటీ మద్రాస్ ప్రొఫెసర్లు కూడా ప్రమాదం జరిగిన చోటుకు వెళ్లి పరిస్థితిని అంచనా వేశారు. ప్రమాదం జరిగి 15 రోజులైనా టన్నెల్లో చిక్కుకున్న 8 మంది జాడ కోసం రెస్క్యూ బృందాలు తీవ్రంగా అన్వేషిస్తూనే ఉన్నాయి. కేరళకు చెందిన క్యాడవర్ డాగ్లను పంపినా బురద, నీటి ఊటల కారణంగా గుర్తించలేక వెనుదిరిగాయి. సొరంగం లోపల 13.65 కిలోమీటర్ల వద్ద ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, సింగరేణి ర్యాట్ మైనింగ్ టీం తవ్వకాలు జరుపుతూనే ఉన్నాయి. సహాయ చర్యలకు టీబీఎం ఆటంకంగా మారింది. సుమారు 4 రోజులుగా తవ్వుతున్నా లోపలి నుంచి శిథిలాలు మాత్రమే బయటపడుతున్నాయి. ప్రమాదం జరిగిన చోట సొరంగమార్గం మరింత ప్రమాదకరంగా మారుతుందని రెస్క్యూ అధికారు లు తెలిపారు. నీటి ఊట, బురదతో సహాయ చర్యలకు ఆటంకం కలుగుతున్నదని, రోబోల సాయం తో కార్మికుల ఆచూకీ కనుక్కోవాలని నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు.
ఇంకా దొరకని నీటి ఊటల జాడ
సొరంగంపై భాగంలో నల్లమల్ల అటవీ ప్రాం తంలో నేషనల్ జియోలాజికల్ సర్వే టీం అటవీ శా ఖ అధికారులతో కలిసి ముమ్మరంగా అన్వేషిస్తున్న ది. ఎక్కడి నుంచి నీటి ధారాలు సొరంగంలోకి వెళ్తున్నాయో? ఆ ప్రదేశాన్ని గుర్తించేందుకు జల్లెడ పడుతున్నాయి. పైనుంచి నీటిని మళ్లించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.