ఇబ్రహీంపట్నం, మే 10: ప్రోత్సాహం, అవకాశం లభిస్తే తాము కూడా ఏదైనా సాధిస్తామని నిరూపించారు ఇబ్రహీంపట్నం ప్రభుత్వ బాలికల పాఠశాల విద్యార్థినులు. మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో పుట్టిన వీరు.. అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తయారు చేసిన రోబోకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. గురువారం అంతర్జాతీయ టెక్నాలజీ దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలోని ప్రగతి మైదానంలో రోబోటెక్ ప్రదర్శనను ఏర్పాటు చేసింది. ఇందులో వీరు తయారు చేసిన రోబోను ప్రదర్శించనున్నారు.
దీంతో ముగ్గురు విద్యార్థినులను ప్రభుత్వ ఖర్చులతో ఢిల్లీకి తీసుకెళ్లారు. ఇబ్రహీంపట్నం ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థినులు శ్రీహర్షిణి, వైష్ణవి, మనీషా రోబోటెక్ చిప్స్ ద్వారా వెల్కమ్ రోబోను తయారు చేశారు. వీరు తయారు చేసిన రోబోకు ఇంత గుర్తింపు రావడం పాఠశాలకే గర్వకారణమని డీఈవో సుశీందర్రావు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం పాఠశాల స్థాయి నుంచే టెక్నాలజీలో నూతన ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టిన నేపథ్యంలో వీరికి ఈ అవకాశం లభించిందని ఆయన పేర్కొన్నారు. ఈ రోబో.. వ్యాపార, వాణిజ్య సంస్థల్లో స్వాగతం పలికేందుకు ఉపయోగపడుతుంది.