ఆమె రోదన పట్టించుకోకుండా ముందుకుసాగిన మంత్రులు‘ప్రజాపాలన’ గిడసబారిందా? స్పందన, స్పర్శజ్ఞానం లేనిస్థితికి సర్కారు దిగజారిందా? పసిగుడ్డు శవం.. ఓ తల్లి రోదన.. ఓ కుటుంబం ఆవేదన.. కండ్లముందు కనిపిస్తున్నా కదలిక లేదా?
కనికరం రాలేదా? ప్రచారయావలో పడి.. ప్రజల గోడును వదిలేశారా? మానవీయత మరిచి.. సంకుచిత రాజకీయాల చుట్టూ ప్రభుత్వ పెద్దలు పరిభ్రమిస్తున్నరా? ములుగులో మంత్రుల రోడ్‌షోలో కనిపించిన హృదయ విదారక దృశ్యమిది! ‘ప్రభుత్వ’ దవాఖానలో.. వైద్యుల నిర్లక్ష్యంతో శిశువు మృతిచెందింది. ఇబ్బందిగా ఉన్నదని చెప్తున్నా వినకుండా కాన్పు చేయడం వల్లే బిడ్డ చనిపోయాడని ఆ కుటుంబం ఆందోళనకు దిగింది. రోడ్డుపై బైఠాయించింది. అదే రహదారిలో మంత్రులు పొంగులేటి, సీతక్క రోడ్‌షో చేస్తూ వచ్చారు. బిడ్డను చంపేశారని, తమకు న్యాయం చేయాలని ఆ కుటుంబం పసిగుడ్డు మృతదేహాన్ని పైకెత్తి చూపుతూ నిలబడింది. ఓపెన్ టాప్ వాహనంలోఅభివాదం చేస్తూ వచ్చిన మంత్రులు.. శిశువు శవం కనిపించినా ఆగలేదు. పిలిచి ఏమైందని అడగలేదు. నినాదాలు, మైకు రొదల మధ్య ఆ పేద కుటుంబం రోదన ఒంటరిగా మిగిలిపోయింది.
ములుగు, ఏప్రిల్ 18 (నమస్తే తెలంగాణ): వైద్యుల నిర్లక్ష్యంతో పురిట్లోనే పసికందు చనిపోయిందని.. తమకు న్యాయం చేయాలని బాధిత కుటుంబం వేడుకున్నా ఆ మంత్రుల మనసు కరగలేదు. భారీ జన సమూహంలో అతికష్టం మీద బిడ్డ మృతదేహాన్ని చూపిస్తూ అభ్యర్థిస్తున్నా రోడ్ షో మత్తులో మంత్రులు మునిగితేలారు. భూభారతి పైలట్ ప్రాజెక్ట్‌లో భాగంగా ములుగుకు వచ్చిన మంత్రి పొంగులేటి , మరో మంత్రి సీతక్కతో కలిసి కార్యకర్తల ఘనస్వాగతాన్ని స్వీకరించారు. రోడ్‌షో, బైక్‌ర్యాలీని ఆస్వాదించారే తప్ప, కండ్లెదుటే పసిగుడ్డు మృతదేహం కనిపిస్తున్నా, మళ్లీ వచ్చి మాట్లాడుతామని మాటతప్పారు. ములుగు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలో బండారుపల్లికి చెందిన బిళ్ల రవళి కాన్పు కోసం దవాఖానలో చేరింది. తనకు ఇబ్బందిగా ఉన్నదని చెప్పినా వినకుండా శుక్రవారం వైద్యులు డెలివరీ చేయడంతో పసిబిడ్డ మృతి చెందింది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగా బిడ్డ మృతిచెందిందని, తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ పసికందు తండ్రి బిళ్ల చందుతోపాటు కుటుంబ సభ్యులు దవాఖాన ఎదుట జాతీయ రహదారిపై బైఠాయించి ధర్నా చేశారు.
అదే సమయంలో వెంకటాపూర్ మండలకేంద్రంలో భూ భారతి రెవెన్యూ సదస్సుకు హాజరయ్యేందుకు వచ్చిన మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీతక్క ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద హెలీప్యాడ్ దిగి ఓపెన్‌టాప్ వాహనంపై రోడ్ షోగా బయలుదేరారు. ఈ క్రమంలో పోలీసులు రోడ్డుపై బైఠాయించిన పసికందు కుటుంబ సభ్యులను పక్కకు లాగేశారు. పోలీసులు, బాధిత కుటుంబ సభ్యులకు తోపులాటతోపాటు తీవ్ర వాగ్వాదం జరిగింది. పోలీసులు వారిని పక్కకు లాగడంతో తమకు న్యాయం చేయాలని కోరుతూ రోడ్‌షోగా వచ్చిన మంత్రులకు పసికందు మృతదేహాన్ని తలపై పెట్టుకొని చూపించి నిరసన వ్యక్తం చేశారు. గమనించిన మంత్రి సీతక్క తాము భూ భారతి కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెళ్తున్నామని, బాధ్యులపై చర్యలు తీసుకొని తప్పకుండా న్యాయం చేస్తామని రోడ్ షో కాన్వాయ్ మీద నుంచి చెప్పి ఆగకుండా వెళ్లిపోయారు. మంత్రుల రోడ్ షోకు, బైక్ ర్యాలీకి..న్యాయం కోసం బైఠాయించిన తమ బాధ అడ్డు వచ్చిందా.., పసిప్రాణం పోతే మంత్రులకు పట్టదా? అని బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు. బంధువులు బాలింత అయిన రవళిని ప్రభుత్వ దవాఖాన నుంచి బయటకు తీసుకెళ్లి పక్కన ఉన్న ప్రైవేట్ దవాఖానలో అడ్మిట్ చేశారు. రోడ్‌షోలో నిగమ్నమైన కాంగ్రెస్ నాయకులు సైతం మానవత్వం చూపకపోవడం, మంత్రులు వాహనాన్ని ఆపి దిగి వచ్చి బాధిత కుటుంబాన్ని ఓదార్చకపోవడం పలు విమర్శలకు దారి తీసింది. కాగా, తన బిడ్డ చావుకు ప్రభుత్వ దవాఖాన సిబ్బందే కారణమని తల్లి రవళి విలపిస్తూ తెలిపింది.