హైదరాబాద్, జూన్ 15 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఈ నెల 22న ప్రారంభించనున్న అమరుల స్మారక చిహ్నం నిర్మాణ పనులు పకడ్బందీగా కొనసాగుతున్నాయని రోడ్లు, భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి తెలిపారు. గురువారం ఆయన అమరవీరుల స్మారకం నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం ప్రారంభోత్సవ కార్యక్రమానికి చేయాల్సిన ఏర్పాట్లతోపాటు తాతాలిక రూట్‌మ్యాప్‌పై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, డీజీపీ అంజనీకుమార్ ఇతర ఉన్నతాధికారులతో మంత్రి వేముల చర్చించారు.
సచివాలయ ప్రాంగణంలో మాత్రమే అన్ని వాహనాలకు పారింగ్ ఏర్పాటుచేయాలని పోలీసులకు సూచించారు. స్మారకం ప్రారంభోత్సవం సందర్భంగా నిర్వహించనున్న ర్యాలీలో ఐదువేల మందికిపైగా జానపద కళాకారులు పాల్గొంటారని, వారి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. సీటింగ్ ఏర్పాట్లు, బందోబస్తు తదితర అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. మంత్రి వేముల వెంట జీఏడీ కార్యదర్శి శేషాద్రి, ఆర్అండ్బీ కార్యదర్శి శ్రీనివాసరాజు, హైదరాబాద్ కలెక్టర్ అమేయ్‌కుమార్, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్‌కుమార్, సమాచార, పౌర సంబంధాలశాఖ స్పెషల్ కమిషనర్ అశోక్‌రెడ్డి, సాంసృతికశాఖ సంచాలకుడు హరికృష్ణ, ఆర్అండ్ బీ ఈఎన్సీ గణపతిరెడ్డి తదితరులున్నారు.
సమీక్షా సమావేశం అనంతరం సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు నరేందర్‌రావు, తెలంగాణా గెజిటెడ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షురాలు మమత, తెలంగాణా నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్‌తో సీఎస్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. అమరవీరుల స్మారక కేంద్రం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఉద్యోగులు, అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని సూచించారు.